కేరళలో ప్రాణాలు తీస్తున్న ప్రాణాంతక బ్యాక్టీరియా.. కరోనా కంటే ప్రమాదమా..?

2020 సంవత్సరం దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ లు, బ్యాక్టీరియాలు ప్రజలకు కొత్త కష్టాలను సృష్టిస్తున్నాయి. ఒక వ్యాధి అదుపులోకి వచ్చిందని అనుకునే లోపు మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. దేశంలో 10 నెలలు గడిచినా కరోనా మహమ్మారి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినా వైరస్ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చినా కరోనాను కట్టడి చేయలేమా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలు వెలుగులోకి వస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా అనే బ్యాక్టీరియా వల్ల 11 సంవత్సరాల బాలుడు మృతి చెందారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ఆ బాలుడితో సన్నిహితంగా మెలిగిన వారిలో సైతం షిగెల్లా లక్షణాలు కనిపిస్తున్నాయి. బాలుడి స్నేహితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందితే మాత్రం కరోనా కంటే ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో తిప్పడం, జ్వరం, అతిసారం లాంటి లక్షణాలు ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కేరళలో ఈ వ్యాధి బారిన పడి 20 మంది ఆస్పత్రులలో చేరారు. అయితే వైద్యులు మాత్రం ఈ బ్యాక్టీరియా కొత్తది కాదని చాలా సంవత్సరాల క్రితమే దీనిని గుర్తించారని చెబుతున్నారు.

గతేడాది ఒక పాఠశాలలో 40 మంది విద్యార్థులలో షిగెల్లా వ్యాధి లక్షణాలు కనిపించగా వీరిలో ఇద్దరికి షిగెల్లా నిర్ధారణ అయింది. కొందరు ఈ బ్యాక్టీరియా బారిన పడినా ఎలాంటి లక్షణాలు కనిపించవని అయితే షిగెల్లా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణతో పాటు చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.