డైరెక్టర్ తేజ ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆయన తండ్రి ఏం చేసేవారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి అందరికీ తెలిసినదే. చిత్రం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన దర్శకుడుగా మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఇండస్ట్రీ లోకి రాకముందు ఆయన ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి తన తండ్రి ఏం చేసేవారు అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు. తేజ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన అక్కల సహాయంతో ప్రస్తుతం ఈ స్థాయికి వచ్చారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే తేజ కెమెరా డిపార్ట్మెంట్ లో చేరి, ఆ తరువాత కెమెరా ఆపరేటివ్ గా, డైరెక్టర్ గా ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్నారు. దర్శకుడు తేజ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు జె.బి.కె. చౌదరి. అందరూ ఆత్మీయంగా తనని జెబీకే అని పిలుచుకునేవారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జెబీకే తన మిత్రుల సహాయంతో “ధర్మపత్ని” అనే సినిమాను చేశారు.

జెబీకే, రాణి దంపతులకు ఇద్దరు కూతుర్ల తరువాత తేజ జన్మించారు. తేజ అసలు పేరు ధర్మ తేజ. అప్పటికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పేరు జయంతి ధర్మతేజ ఉండేవారు. ఆయన పేరున ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన కొడుకుకు ఆ పేరును పెట్టారు. తన కొడుకు పుట్టిన తరువాత తన తండ్రి జపాన్ కి హ్యూమన్ హెయిర్ ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేసేవారు. అయితే వ్యాపారంలో బాగా నష్టం రావడమే కాకుండా తన భార్య మృతి చెందడంతో ఎంతో కుంగిపోయారు.

ఈ క్రమంలోనే తేజ పది సంవత్సరాల వయసులో తల్లి తండ్రి ఇద్దరు మరణించగా తన అక్కల సహాయంతో ఉన్నత చదువులు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ముంబైకి వెళ్లి ఇండస్ట్రీ లో కెమెరా డిపార్ట్మెంట్ లో చేరారు. ఈ విధంగా ఎన్నో సినిమాలలో పనిచేసిన తేజకి రామ్ గోపాల్ వర్మ పరిచయం కావడంతో ఆయన తెరకెక్కించిన “శివ” సినిమాకు కెమెరామెన్ ఆపరేటర్ గా పని చేశారు. అలాగే వర్మ “రాత్రి” సినిమాతో ఫోటోగ్రాఫర్ గా మారారు.

ఇలా ఎన్నో సినిమాలలో కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేసిన తేజ రామానాయుడు గారిని ఒప్పించి కేవలం 30 లక్షల బడ్జెట్ తో ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ “చిత్రం” సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.