‘మా’ బరిలో నిలిచిన తుది జాబితా ఇదే.. వెల్లడించిన కృష్ణమోహన్

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 10 న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ తేదీ దగ్గర పడుతున్న వేళ అధ్యక్ష బరి నుంచి బండ్ల గణేష్ , సీవీఎల్ నరసింహారావులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇక అధ్యక్ష పోటీలో మిగిలింది మంచు విష్ణు, ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు.

2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా.. మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు మినహా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నరసింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇక చివరకు వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగానే జరిగింది. చివరకు వీళ్లిద్దరే మిగిలారు. తుది జాబితాలో పేర్లు ఇలా ఉన్నాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబుమోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో ఉండే రెండు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి పోటీలో ఉండగా.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ, హేమలు పోటీలో ఉన్నారు. ఇక మా అసోసియేషన్ లో అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టు విషయానకి వస్తే.. మొత్తం ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.

అందులో జీవితా రాజశేఖర్, రఘుబాబు మరియు బండ్ల గణేష్.. అయితే దీనిలో బండ్ల గణేష్ తప్పుకోగా… ఇక విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవితా రాజశేఖర్ మిగిలారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా… రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి లు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ఇక ఈసీ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 18 పోస్టులు ఉండగా.. దానికి 39 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరుగుతాయనే విషయం తెలిసిందే.