తమిళ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు నుంచి ఎదురైన చేదు అనుభవం!

తమిళ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను పన్ను వడ్డీలో మినహాయింపును కోరుతూ హీరో సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సూర్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నోటీసులను జారీ చేసింది.

2010వ సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ సూర్య ఇంటిపై దాడులు చేసి సూర్య ఆస్తిపాస్తులను అంచనా వేశారు. ఈ దాడుల అనంతరం రూ.3.11 కోట్లు చెల్లించాలని అతనికి నోటీసులను జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను మదింపు కోసం వడ్డీని తగ్గించాలంటూ సూర్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సూర్యకు ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

తాజాగా మంగళవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం ఐటి శాఖ వాదన విన్న తర్వాత ఆదాయపు పన్ను మదింపుకు సహకరించలేదని సూర్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ అతడు ఆదాయపు పన్ను శాఖ తెలిపిన డబ్బులు చెల్లించాలని ఉత్తర్వులలో పేర్కొంటూ.. ఆ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ విధంగా హై కోర్ట్ డబ్బులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సూర్య ప్రస్తుతం ఆ డబ్బులు చెల్లిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2010వ సంవత్సరంలో ఐటి శాఖ అధికారులు సూర్య ఇంటితో పాటు బోట్ క్లబ్ ప్రాంతంలోని బంగ్లా, అతని సన్నిహితుల కార్యాలయాలలో కూడా సోదాలు జరిపిన తర్వాత ఈ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.