ఇదెక్కడి పైత్యంరా బాబు.. చనిపోయిన వారిని కూడా వదలట్లేదుగా వర్మ..!

టాలీవుడ్ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 30 సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) అతని కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసారు. అంతే కాకుండా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. దీనిపై అతడు ప్యాడ్‌కాస్ట్ రూపంలో రెండు ఆడియో క్లిప్స్‌ను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

షేర్ చేసిన ఆడియో టేప్‌లో.. ఆర్జీవీ తన శివ సినిమాలోని పాటలకు సిరివెన్నెల సాహిత్యం రాశారని చెప్పారు. సిరివెన్నెల రాసిన .. ‘సాహసమే నా దారి రాజసం నా రథాన్ని ఆపడం సాధ్యమేనా’ అన్న మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటలోని పదాలే నా ప్రాణం. ఇంత అద్భుతమైన మాటలు రాయడం వల్ల.. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన మీరు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు.

దుఃఖంతో సిరివెన్నెల దర్శనమిస్తే స్వర్గంలో కలిసి అమృతం తాగాలని కోరాడు. ఒక వేళ అక్కడ వాట్సాప్ లాంటివి ఉంటే.. అమృతం ఎలా ఉందో వాట్సాప్ చేయండంటూ కోరారు. అంతే కాకుండా.. అక్కడ రంభ, ఊర్వశి, మేనకలు ఎలా ఉన్నారో చెబితే తాను సంతోషిస్తానన్నాడు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఉన్నాను.. మీరు స్వర్గం లో ఉన్నారు అంతే తేడా అన్నారు వర్మ.

ఇక అతడు షేర్ చేసిన ఆ ఆడియో టేప్ లో.. తెలివి ఉన్నవాడు ఎవడైనా స్వర్గంలోకే వెళ్తాడని.. మీరు స్వర్గానికి వెళ్లినందుకు తనకు హ్యాపీగా ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే తరాలకు సిరివెన్నెల స్ఫూర్తి అని ఆర్జీవీ కొనియాడాడు. అయితే వర్మ పోస్ట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. నీ క్రియేటివిటీకి దండరా సామి అంటూ కొందరు దండుకుంటున్నారు.