Suresh Babu : మా నాన్న బయోపిక్ తీయకపోడానికి కారణం ఇదే.. ఇంత వరకూ తీసిన బయోపిక్స్ లో ఎక్కడైనా నిజాలు చూపించారా? : సురేష్ బాబు

Suresh Babu : దేవత సినిమాతో సినిమా నిర్మాణ పనులు చూసుకున్న దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా మారింది మాత్రం వెంకటేష్ తో తీసిన బొబ్బిలి రాజా సినిమాతోనే. ఆ తరువాత కూలీ నెంబర్ 1, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, తులసి, నువ్వులేక నేను లేను వంటి హిట్ సినిమాలను తీసిన సురేష్ గారు రామానాయుడు గారి పెద్దకొడుకు అని అందరికీ తెలుసు. రామానాయుడు గారు చాలా సినిమాలు నిర్మించారు. ఆయన బయోపిక్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు.

బయోపిక్ లలో ఎన్ని నిజాలు ఉంటున్నాయి…

రామానాయుడు గారు మూవీ మొగల్ గా పేరుపొందారు. అలాంటి ఆయన జీవిత చరిత్ర సినిమా రూపంలో తీస్తే నేటి తరం వారికి ఆయన గురించి తెలుస్తుంది. ఇదే ప్రశ్న సురేష్ బాబు గారిని అడుగగా ఆయన బయోపిక్ తీయాలనే ఉద్దేశం తనకు లేదని, అందరూ అడుగుతున్నారు కానీ ఇంకా ప్లాన్ చేయలేదని అన్నారు. బయో పిక్ లో వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలి, కానీ మొదటి నుండి మా కుటుంబం వ్యక్తిగత విషయాలను బయటపెట్టలేదు. చాలా గోప్యంగా వ్యక్తిగత జీవితాన్ని సినిమా జీవితానికి దూరంగా ఉంచాము. కానీ ఇప్పుడు బయో పిక్ అంటే అవన్నీ చెప్పాల్సి వస్తుంది.

అలా కాకుండా కేవలం సినిమాల గురించి ఆయన జీవిత చరిత్ర చూపిస్తే బోరింగ్ గా ఉంటుంది. ఇక ఆ సినిమా జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉండొచ్చు, అవి ఇతరులను ఇబ్బంది పెట్టొచ్చు. అందుకే బయోపిక్ ఆలోచన చేయడం లేదు అన్నారు. ఇక ఇప్పట్లో వచ్చిన చాలా బయో పిక్ సినిమాల్లో ఎన్ని నిజాలు ఉంటున్నాయి, కొన్ని మార్చినవైతే మరి కొన్ని అవే నిజమని నమ్మి వారికి తెలియకుండానే అపద్ధాన్ని నిజంగా చెప్పి తీస్తారు. అలా మనకు తెలిసిన వాళ్ళ జీవితాల చరిత్రల్లో నిజాలు లేకపోతే ఇక మనం పుస్తకాల్లో చదివిన చరిత్రలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకు తెలియదు కదా అంటూ మాట్లాడారు.