పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు.. అలాంటి రాజకీయ నేత అంటూ..?

2014 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తరువాత టీడీపీతో నాలుగేళ్ల పాటు జనసేన కలిసి పని చేసినా 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే రావడం, పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఆ పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించారు. అయితే ఆ ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ పై అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా రాపాక వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదట్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పోటీ చేయడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అలా చెప్పడం పవన్ అభిమానులకే నచ్చలేదు. ఇదే సమయంలో తమిళనాడులోని పత్రికలలో ఒకటైన తమిళ మురసు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేసింది.

ఆ పత్రిక పవన్ కళ్యాణ్ ను గందరగోళ రాజకీయవాదిగా పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళ రాజకీయవాది అని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.