మారిన మ్యూజికల్ కాంబినేషన్.. మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల కాంబినేషన్ , హీరో డైరెక్టర్ కాంబినేషన్ కాకుండా, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ విధంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ-దేవి శ్రీ ప్రసాద్, శ్రీకాంత్ అడ్డాల -మిక్కీ జె మేయర్, శివ నిర్వాణ -గోపీసుందర్ కాంబినేషన్లు అలాంటి కోవకు చెందుతాయి. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఇన్ని రోజులుగా వరుస కాంబినేషన్లో వస్తున్న వీరిద్దరూ ఈ సారి వారి కాంబినేషన్ మార్చుకున్నారు.

జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఈ విధంగా మారారా.. లేక వీరికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్లు మారారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్, భరత్ అనే నేను, మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కి బదులుగా మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘లాహే లాహే’ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

నిన్ను కోరి, మజిలీ, వంటి చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మదిని దోచిన శివ నిర్వాణ తన చిత్రాలకు గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టక్‌ జగదీష్‌” చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని ఎస్.ఎస్ తమన్ కు కల్పించారు. ఈ విధంగా ఈ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ ఈ సారీ మారిందని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.