Tag Archives: onions crops

ఆగ్రహించిన ఉల్లి రైతు.. మార్కెట్ కు తీసుకొచ్చిన పంట విషయంలో..!

మొన్నటి వరకు ఉల్లి ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో ఎక్కువగా రైతులు లాభపడ్డారు. ప్రస్తుతం అదే ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను పండించిన పంటకు నిప్పు పెట్టాడు.

ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంచలింగాల గ్రామానికి చెందిన ఉల్లి రైతు వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లాడు. మొన్నటి వరకు మంచి డిమాండ్ ఉన్న ఉల్లికి ప్రస్తుతం కూడా అదే డిమాండ్ ఉంటుందని అనుకున్నాడు.

కానీ అతడు కర్నూలు మార్కెట్‌కు తన ఉల్లిని తీసుకొచ్చిన తర్వాత షాక్ అయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతిలో క్వింటా రూ.350 ధర పలకడంతో దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతి ద్వారా కొంతమంది రైతులకు మాత్రమే మంచి ధరలు వస్తున్నాయని.. మిగతా వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా.. ఆగ్రహించిన రైతు ఉల్లి బస్తాలపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ఇక దీనిపై అధికారులు స్పందించారు. క్వింటాల్ కు రూ.600 నుంచి రూ.700 మధ్య ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇటువంటివి మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.