Tag Archives: Road Facility

హైవే పక్కనే ఆ రెండు గ్రామాలు ఉన్నాయి.. కానీ వాళ్ల ఊర్లకు మాత్రం రోడ్డు లేదు.. ఎక్కడంటే..

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక రంగం నుంచి మొదలుకొని.. ఎన్నో రంగాల్లో అద్బుతంగా రాణిస్తుంది.. అప్పటి భారత ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని 2000 సంత్సరంలో ప్రేశపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలని.

మారు మూల పల్లెల దగ్గర నుంచి గిరిజనులు ఉండే.. ప్రాంతాల వరకు రోడ్లను అనుసంధానం చేయలనేది లక్ష్యం. అయితే అప్పటి నుంచి రోడ్డు లేని గ్రామం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు పంచాయతీ పరిధిలోని ఎగువ దొనబైలు, దిగువ దొనబైలు గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్న ఊర్లు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అది మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రామాలకు హైవే రోడ్డు కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రామాల్లో 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. హైవే నుంచి వాళ్ల ఊరికి వెళ్లాలంటే మాత్రం రోడ్డు సౌకర్యం లేదు.

అధికారులను ఎన్నో సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా స్పందించడం లేదంటూ వాపోతున్నారు. మదనపల్లె-బెంగళూరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న చీకలబైలు కొండలపై ఈ రెండు గ్రామాలున్నాయి. వీళ్ల గ్రామాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అధికారులు తమ సమస్యను పట్టించుకొని రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.