Teena: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ఆట టైటిల్ విన్నర్ టీనా కన్నుమూత..

Teena: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ అయిన టీనా మృతి చెందారు. ఓంకార్‌ హోస్ట్ గా నిర్వహించిన ఆట డ్యాన్స్‌ షో సీజన్ 1 తో టీనా చాలా పాపులర్‌ అయ్యారు. తరువాత సీజన్ 4 కి టీనా న్యాయనిర్ణేత గా కూడా వ్యవహరించారు. అయితే టీనా ఇన్నాళ్లుగా చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరంగా ఉన్నారు, అసలు టీనా మరణానికి గల కారణాలు అనేవి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈరోజు టీనా గోవాలో మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. టీనా సాధు మృతిచెందిన విషయాన్ని ఆట సందీప్‌ తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలియచేసారు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హాటాత్తుగా మరణించడంపై తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సర్వత్రా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక ఆట సందీప్‌ తన ఇన్‌ స్టా గ్రామ్‌ ఖాతాలో టీనాతో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ ఈ విధంగా తన భావాలను తెలియజేసారు… ‘టీనా సాధు మరణవార్త విని నేను ఎంతో షాకయ్యాను. టీనా మరణం నన్ను ఎంతో బాధించింది. ఆట సీజన్‌ 1లో టీనా నా పార్టనర్, టీనా ఎంతో మంచి వ్యక్తి. ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. టీనా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఆట సందీప్‌ తన ఇన్ స్టా లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆట సందీప్ చేసిన ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.