Thammareddy Bharadwaja : పాన్ ఇండియా అంటూ కోట్లు పెట్టి కంటెంట్ లేని సినిమాలు తీస్తున్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..

Thammareddy Bharadwaja : సీనియర్ నిర్మాత, డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమాలు, సినిమా తారల గురించి మొహమాటం లేకుండా మాట్లాడుతూ వైరల్ అవుతుంటారు. తాజాగా మేజర్ సినిమా హీరో అడివి శేష్, డైరెక్టర్ శశికిరణ్ తిక్కను ఇంటర్వ్యూ చేసిన ఆయన పరోక్షంగా పాన్ ఇండియా సినిమాలపై చురకలు వేసారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు పెడుతున్న బడ్జెట్ల గురించి ప్రొడక్షన్ కాస్ట్ గురించి కామెంట్స్ చేసారు.

పాన్ ఇండియా పేరుతో కంటెంట్ లేని సినిమా…

మేజర్ సినిమాను ప్రశంసించిన తమ్మారెడ్డి, సినిమాను 30 నుండి 40 కోట్ల మధ్యలోనే ఎలా తీసారంటు ప్రశ్నించాడు. ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా పేరుతో ఎక్కువ బడ్జెట్లో తీస్తుంటే మీరు అదే క్వాలిటీ సినిమాను ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా తీస్తున్నారని అడిగారు. సమయాన్ని వృధా చేస్తూ ప్రొడక్షన్ కాస్ట్ పెంచుతున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆరు నెలలో ఒక సినిమా పూర్తి చేస్తే సినిమా తీసే ఖర్చు తగ్గుతుందని, కానీ సంవత్సరాల తరబడి సినిమా తీస్తారంటూ చురకలు వేశారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి కూడా సటైర్లు వేశారు తమ్మారెడ్డి. మేజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఒక పెద్ద హీరోని పిలిచి దేవుడంటూ పొగడలేదు ఎందుకు అంటూ మాట్లాడారు. సినిమా ప్రీ రిలీజ్ కి వచ్చిన హీరో మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా సినిమా గురించి ప్రొమోషన్స్ చేయమంటే ఆ హీరో కి భజన చేస్తారని కనీసం సినిమా చూసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం వల్ల గాలి మాటలు చెప్పి ఆ వచ్చిన హీరో వెళ్లిపోతున్నాడని మీరు అలా చేయనందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ మధ్యకాలంలో నార్త్ లోనూ మంచి సినిమాలు వస్తున్నాయని భూల్ భూలయ బాగుందని ఇక తెలుగులో మేజర్, మరియు తమిళ్ విక్రమ్ సినిమాలు బాగున్నాయని అన్నారు.