Categories: General News

కొత్త గూటికి చిన్నారుల అడుగులు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో దత్తతలు..

హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించే దత్తత ప్రక్రియ తెలంగాణలో వేగం పెంచుతోంది. పిల్లలు లేని దంపతులు అనాథ చిన్నారులను స్వీకరించేందుకు ముందుకు వస్తుండటంతో రాష్ట్రంలో దత్తతల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 307 మంది చిన్నారులు కొత్త కుటుంబాల్లో చేరడం ఇప్పటివరకు రికార్డుగా నమోదైంది.

దత్తతలపై సమాజంలో ఉన్న పాత అపోహలు తగ్గిపోవడం, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. చట్టబద్ధమైన విధానంలో దత్తత తీసుకోవాలన్న స్పష్టత కూడా ప్రజల్లో పెరగడంతో మరింత మంది దంపతులు ముందుకొస్తున్నారు. ఫలితంగా అనాథ పిల్లలకు కుటుంబ ప్రేమ, భద్రత దక్కుతోంది.

ఈ ఏడాది దత్తత తీసుకున్న 307 మంది చిన్నారుల్లో 277 మంది దేశంలోని వివిధ ప్రాంతాల దంపతుల చేతుల్లోకి వెళ్లారు. వీరిలో 44 మంది పదేళ్లకు పైబడిన పిల్లలు ఉండటం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. సాధారణంగా చిన్న వయసు పిల్లలకే ఎక్కువ డిమాండ్ ఉండే పరిస్థితుల్లో, పెద్ద వయసు పిల్లలకూ కుటుంబాలు లభించడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

విదేశీ దత్తతల విషయానికొస్తే, ఈ ఏడాది 30 మంది చిన్నారులు ఇతర దేశాల్లోని కుటుంబాలకు చేరుకున్నారు. ఇందులో 29 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. శారీరక, మానసిక సవాళ్లు ఉన్న పిల్లలను కూడా స్వీకరించేందుకు విదేశీ దంపతులు ముందుకు రావడం ఆశాజనకంగా అధికారులు పేర్కొంటున్నారు.

గత దశాబ్దంతో పోలిస్తే దత్తతల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. 2014-15లో 150 మంది చిన్నారులు దత్తతకు వెళ్లగా, ఆ సంఖ్య 2023-24లో 166కి పెరిగింది. 2024-25లో 220 మంది పిల్లలు కొత్త కుటుంబాలను చేరుకోగా, తాజా సంవత్సరంలో అది 307కి చేరింది. ఈ గణాంకాలు దత్తతపై ప్రజల్లో మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఒకప్పుడు దత్తత ప్రక్రియపై అనేక అనుమానాలు, సామాజిక భయాలు ఉండేవి. దీంతో అనాథాశ్రమాల్లో పిల్లలు దీర్ఘకాలం గడపాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. దత్తతను ఒక బాధ్యతగా, సామాజిక సేవగా చూస్తున్న దంపతుల సంఖ్య పెరుగుతోంది.

అక్రమ దత్తతలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. చట్టబద్ధమైన మార్గంలోనే దత్తత ప్రక్రియ జరగాలని విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 55 దత్తత సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, దంపతులకు అవసరమైన సమాచారం అందిస్తోంది.

కలెక్టరేట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా ఈ హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తున్నాయి. దత్తతపై ఆసక్తి ఉన్న వారికి మార్గదర్శనం చేయడం ద్వారా ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నారు.

రాబోయే సంవత్సరంలో కనీసం 350 మంది చిన్నారులను దత్తతకు ఇవ్వాలనే లక్ష్యంతో శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. మరింత మంది పిల్లలకు కుటుంబ ప్రేమ అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago