Mahanati Savithri : మహా భారతంలో కర్ణుడు కవచకుండలాలు ఒలిచిస్తే.. నవ భారతంలో ఈ ‘మహానటి’ నగలు ఒలిచిచ్చింది.!!

Mahanati Savithri : సావిత్రిని మహానటి అనేకంటే మహా దానశీలి అనడం సరిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ధనం ఉంటే చాలదు. దానం చేసే గుణం కూడా ఉండాలి. ఆ రెండు కూడా ఆ రోజుల్లో అమితంగా ఉన్న వారెవరో కాదు మహానటి సావిత్రి. 1965 ఆమె సినీ పరిశ్రమలో ఉచ్చ స్థితిలో ఉన్న సమయం.. అప్పటికి ఇంకా సావిత్రి మద్రాసులో సొంతగృహాన్ని కొనుగోలు చేయలేదు. ఆ సమయంలోనే భారత్ కు అత్యవసర, విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి.

భారత్ – పాకిస్తాన్‌ల సరిహద్దుల వద్ద జరిగిన చిన్న తగాదాలు తారస్థాయికి చేరుకోవడంతో భారత్ పాక్ యుద్ధం ప్రారంభమైంది. 1965లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారు. పాకిస్తాన్ తలపెట్టిన ఆపరేషన్ జిబ్రాల్టర్ యుద్దానికి మూల కారణంగా పేర్కొనవచ్చు. ఈ చర్య ముఖ్య ఉద్దేశం భారత్ కు వ్యతిరేకంగా కాశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు…

అయితే ఈ యుద్ధంలో భారత్ కు యుద్ధ సామాను కొనుగోలుకు విరాళాల సేకరణ జరిగింది. ఆ క్రమంలో…నిండునగలతో భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి కలవడానికి సావిత్రి వెళ్లింది. ఆ విపత్కర పరిస్థితులను తెలుసుకొని సావిత్రి తాను ధరించిన బంగారు ఆభరణాలను, నగలను ఒలిచి భారత ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చారు.

ఆ తర్వాత 1972లో అప్పటి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఒకసారి మద్రాస్ వచ్చారు.ఆ క్రమంలో దేశ రక్షణ నిధికి విరాళాల సేకరణలో భాగంగా పీవీ నరసింహారావుకు వేసిన దండ చాలామంది వేలం పాడగా.. చివరగా 31 వేల రూపాయలకు సావిత్రి గారు కొనుగోలు చేశారు. అప్పటికి ఆమె సొంత సినిమా నిర్మాణ,దర్శక బాధ్యతలు చేపట్టి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ దేశ రక్షణ నిధికి సహాయం చేశారు. ఆ తర్వాత ఒకసారి తన వద్ద పనిచేసే డ్రైవర్ కూతురు వచ్చి తనకు పెళ్లి కుదిరిందని..పెళ్లికి అవసరమైన డబ్బులు లేవనడంతో సావిత్రి తన దగ్గర ఉన్న విలువైన పట్టు చీరను అమ్మితే వచ్చిన మొత్తాన్ని ఆ డ్రైవర్ కూతురికి ఇచ్చి పంపించింది…

మరొకసారి తన సహనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ను కలవడానికి సావిత్రి వెళ్ళింది. అక్కడ ఆమెను చూసిన గుమ్మడి ఒకప్పుడు ఎలా ఉండే దానివమ్మా ఇలా అయిపోయావు అనడంతోనే సావిత్రి గదిలోకి వెళ్లి మంచంపై దిండు కింద కవర్ పెట్టి నేను వెళ్ళిన తర్వాత ఆ కవర్ చూడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. వెంటనే గుమ్మడి ఆ కవర్ ను చూడగానే అందులో 2000 రూపాయలు ఉన్నాయి. ఎప్పుడో నీ దగ్గర తీసుకున్నాను, ఉంచండి పర్వాలేదు అనగానే.. ఇప్పుడు ఈ డబ్బులు అవసరమా అని గుమ్మడి గారు అన్నా కూడా పట్టించుకోకుండా అక్కడినుంచి ఆమె వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు ఆమె జీవితంలో కోకోల్లోలు.. ఒక్కోసారి ఈ సంఘటనలన్నీ కూడా మహాభారతంలోని కర్ణుడిని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ నవభారతంలో సావిత్రి ఎప్పటికీ దానశీలి,గుణశీలి.