నిర్భయ సంఘటన దేశం మొత్తాన్ని ఆలోచింపజేసేలా చేస్తే.. దిశ సంఘటన తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపేసింది. మృగాళ్ల పాశవిక చర్యకు ఒక అబల బలైంది. మగపుటేనుగుల అకృత్యాన్ని చూసి సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ప్రజలు, న్యూస్ ఛానల్స్ లో డిబేట్ లపై డిబేట్స్ జరిగాయి. ప్రతిఒక్కరు ఆక్రోశంతో రగిలిపోయారు. నిందితులను బహిరంరంగంగా ఉరితీయాలని నినదించారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అభిప్రాయలు వ్యక్తం చేసారు. ఇదిలా ఉంచితే సోషల్ మీడియాలో ఈ దురాగతం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరగడం గమనించాల్సిన విషయం.
ఇక్కడే సినిమాల ప్రస్తావన వస్తోంది. వాటి తాలూకు ప్రభావం వల్ల యువత పెడదారి పడుతున్నారన్న వాళ్ళు లేకపోలేదు. భారతీయుడు చూసి లంచాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ మాసిపోలేదు. గణేష్ చూసి దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు డాక్టర్లలో మార్పులు రాలేదు. గాంధీ సినిమా చూసి అహింసే సమాజ హితమని ఎందరు గుర్తించారంటే సమాధానం దొరకడం కష్టం. ఇది ఒక కోణం. నిజంగానే ఎంతో కొంత ప్రభావితం చూపించే సినిమాలు లేకపోలేదు. శివ టైంలో సైకిల్ చైన్ చేతిలో ఉండటం ఫ్యాషన్ గా భావించిన యువత అప్పట్లో కోకొల్లలు. ఏది ఏమైనా సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం.
ఇప్పుడీ ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఉంది. నిర్భయ, దిశ లాంటి అబలలు ఇలాంటి అరాచకాలకు బలి కావడం ఈ మధ్యే మొదలైందా లేక ఈ అరాచక క్రీడ ఏళ్ళ క్రితమే దారులు వేసుకుందా ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే ఈ సినిమా కథనం… 1991లో శోభన్ బాబు ప్రధాన పాత్రలో (వాస్తవానికి ఆయనే హీరో. కానీ కథ రిత్యా కమర్షియల్ కోణంలో ఆయన్ను అలా పిలవడం సబబుగా ఉండదు) పరుచూరి బ్రదర్స్ స్వీయ రచనా దర్శకత్వంలో సర్పయాగం అనే సినిమా వచ్చింది. సుప్రసిద్ధ నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు దీన్ని నిర్మించారు. తక్కువ వ్యయంతో ఇప్పటికీ కాంటెంపోరరీ అనిపించే సబ్జెక్టుతో 31ఏళ్ళ క్రితమే ఇలాంటి కథను రాసుకున్న తీరు నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.
ముందు అందులో కథాసారం ఏంటో చూద్దాం. సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న డాక్టర్ వేణుగోపాల్ (శోభన్ బాబు) ఒకే ఒక్క గారాలపట్టి అనసూయ (రోజా). తన బాల్యంలోనే తల్లి అగ్ని ప్రమాదంలో చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నత విద్య కోసం మంచి కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడ అనసూయ మీద కన్నేసిన సీనియర్ స్టూడెంట్ ఫణి(శ్రీనివాసరావు) ప్రేమ పేరుతో వలలో వేసుకుని ఓ సందర్భాన్ని సృష్టించుకుని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేస్తాడు. విషయం బయటికి చెప్పుకోలేక నరకం అనుభవించిన అనసూయ తండ్రికి ఓ ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది చదివిన వేణుగోపాల్ పోలీస్ న్యాయ వ్యవస్థ తన బిడ్డ ఆత్మకు శాంతి కలిగించలేవని గుర్తించి ఫణితో పాటు అతని స్నేహితులను తానే స్వయంగా హత్య చేసేందుకు రౌడీల సహాయం కోసం ప్రయత్నిస్తాడు.
ఆ క్రమంలో జరిగే పరిణామాలు వేణుగోపాల్ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాయి అనేదే సర్పయాగం కథ.పరుచూరి సోదరులు తాము స్వయంగా దర్శకత్వం వహించే సినిమాకు కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమే. అప్పటి బాక్స్ ఆఫీస్ సూత్రాల దృష్ట్యా కొన్ని అవసరం లేని వాణిజ్య అంశాలు, హాస్యం కోసం సృష్టించిన అదనపు పాత్రలు, పాటలు వగైరా పంటి కింద రాళ్ళలా అడ్డుతగిలినా వేణుగోపాల్ బాధను సరైన భావోద్వేగాలతో ప్రేక్షకులకు అనుసంధానం అయ్యేలా తెరకెక్కించిన తీరు సర్పయాగానికి ఘన విజయం దక్కేలా చేసింది. దురదృష్టం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆ అకృత్యాల్లో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా తీవ్ర రూపం దాల్చడం. తండ్రి విద్యాపరంగా వృత్తిపరంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. కానీ కేవలం ఒక ఆడపిల్లకు తండ్రైన పాపానికి హంతకుడిగా మారాల్సి వచ్చింది. ఎందుకు అనే ప్రశ్న అసంబద్ధం. కూతురి సమాధిపైన హంతకుల నెత్తుటితో తర్పణం వదలాలంటే అది రాజ్యాంగ వ్యవస్థ వల్ల కాదు. పోనీ సరైన రీతిలో చట్టప్రకారం వెళ్తే ఖచ్చితమైన న్యాయం దొరుకుతుందా అంటే దానికీ హామీ లేదు.
దేశ రాజధాని నడిబొడ్డులో నిర్భయను అతి దారుణంగా కిరాతకంగా మానభంగం చేసి హత్య చేసినప్పుడు సదరు నిందితులకు శిక్ష ఖరారు చేయడానికి 7 ఏళ్ళు పట్టింది. అందులో ఒకడు మైనర్ అన్న కారణంగా సానుభూతితో వ్యవహరించాలని వాదించిన లాయర్లు ఉన్నారు. అలాంటప్పుడు తమకు ఇంత ద్రోహం చేసిన వాళ్లకు శిక్ష పడుతుందన్న హామీ బాధిత కుటుంబ సభ్యులకు ఎక్కడి నుంచి వస్తుంది.
కామంతో పెట్రేగి ఆడపిల్లను అనుభవించి కోరికలు తీర్చుకోవాలని చూసే కిరాతకులకు తనే స్వయంగా బుద్ది చెప్పాలనుకున్నాడు.సమాజం గురించి పట్టించుకోలేదు. పేరు ఏమవుతుందని భయపడలేదు.
ఈ రోజు తన బిడ్డ రేపు ఇంకొకరి బిడ్డ. ఇలాంటివాళ్లను కొందరినైనా తాను తుదముట్టిస్తే ఇంకొకరికి గుణపాఠంగా మారుతుందన్న నమ్మకం ఇంత పని చేసేలా ప్రేరేపించింది. కూతురి పెళ్లి కోసం దాచిన పది లక్షల రూపాయలను హంతకులను హత్య చేసేందుకు డా.వేణుగోపాల్ వాడుకున్నాడంటే ఆ మానసిక క్షోభ మాటల్లో అర్థం చేసుకునేది కాదు. ఇలాంటి అకృత్యాలు భవిష్యత్తులో జరుగుతాయనేమో పరుచూరి సోదరులు ఇలాంటి కథతో సర్పయాగం చిత్రం రూపొందించారు.ఈ చిత్రంలో ఉత్తమ నటనకుగాను రోజా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…