ఎవరు ఈ తాలిబన్లు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?

ఇప్పుడు ఎక్కడైనా నలుగురు కలిసి మాడ్లాడుకునే మాట తాలిబన్లు. ఆఫ్ఘానిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తాలిబాన్ల దాటికి చేతులెత్తేయడంతో ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాలిబాన్ల పాలనలో తాము ఉండలేము అంటూ ఇప్పటికే వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్ లో ఉన్న ఒక్కగానొక్క అంతర్జాతీయ విమానంలో దేశం విడిచి వెళ్ళిపోడానికి వేల మంది పోటీ పడటంతో అక్కడి బలగాలు గాల్లోకి కూడా కాల్పులు జరిపాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఒక దేశాన్ని తమ సైన్యంతో అదుపులోకి తీసుకున్న ఈ తాలిబన్లు ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకుందాం..

తాలిబన్ అంటే “విద్యార్థులు” అని అర్థం. వ్యవస్థాపక సభ్యుడు ముల్లా మహ్మద్ ఒమర్ విద్యార్థులు. 1994 సంవత్సరంలో ముల్లా మొహమ్మద్ ఒమర్ అంతర్యుద్ధం సమయంలో అవినీతిని సవాలు చేయడానికి డజన్ల కొద్దీ అనుచరులతో తాలిబన్‌ను స్థాపించారు. ఈ బృందం వాస్తవానికి “ముజాహిదీన్” అని పిలవబడే యోధుల నుండి సభ్యులను ఆకర్షించింది. వారు 1980 లలో ఆఫ్ఘనిస్తాన్ నుండి గతంలో USSR(ఇప్పుడు రష్యా) దళం నుంచి బయటకు వచ్చిన వారు. ఇది 1996 నాటికి దేశంలోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధించింది. 2001 లో సంవత్సరంలో వాళ్ల అరాచకాలకు అమెరికా స్పందించింది. తాలిబన్ల గ్రూపు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా సైనిక బలగాలు చెదరగొట్టాయి.

తర్వాత ముల్లా మహ్మద్ ఒమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొదట శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు. మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా, ఇతర మతస్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. తాలిబన్లకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ మదర్సాలలో చదివే వీరంతా ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు దిగారు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రశాంతంగా పాలన సాగిస్తారనుకుంటే ముజాహిదీన్ నాయకులను మించి తాలిబన్ల ఆటవిక పాలన సాగించారు.

అగ్రరాజ్యం అమెరికాపై 2001 సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్తాన్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001లో అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాటం సాగిస్తోంది అమెరికా. అయితే ఇటీవల యూఎస్ బలగాల ఉపసంహరణతో రెచ్చిపోయిన తాలిబన్లు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారని వార్తలతో ప్రజల కళ్ళముందు తాలిబన్ల క్రూర పాలన కనిపిస్తోంది. ఇంతకాలం టీషర్ట్ లు , జీన్స్ వేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ యువకులు వాటిని తీసివేసి సంప్రదాయ దుస్తులను ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థినులు ఇక తాము చదువుకునే అవకాశం ఉండదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎయిర్ పోర్టులోకి ప్రజులు గుంపుగుంపులుగా వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు ఆఫ్ఘన్ ప్రజలలో తాలిబన్ల పట్ల ఉన్న భయాందోళనలకు అద్దంపడుతున్నాయి. ఆఫ్ఘన్ లో ప్రాణ భయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్టులో దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్ పోర్టుకు క్యూకడుతున్నారు. ఇలాంటి రాక్షస పాలను సాగిస్తున్న వారి చెర నుంచి తమను రక్షించాలని వాళ్లు వేడుకుంటున్నారు.