ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డు ఉంటేనే సరుకులు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సబ్సిడీ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికి బియ్యం కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల నుంచి ఎవరికైతే బియ్యం కార్డులు ఉంటాయో వారికి మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు పాత రేషన్ కార్డులపై పంపిణీ జరగగా కొందరు రేషన్ బియాన్ని తీసుకోవడం లేదు.

మరి కొందరు రేషన్ బియ్యం తీసుకున్నా ఆ బియ్యాన్ని అమ్ముకోవడం లేదా వినియోగించుకోకపోవడం జరుగుతుంది. జగన్ సర్కార్ జనవరి నెల నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు బదులుగా బియ్యం కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విధాలా అర్హులైన వాళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేస్తోంది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించేది. అయితే ఇకపై బియ్యం కార్డులు రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ప్రభుత్వం జనవరి నెల నుంచి ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

జగన్ సర్కార్ బియ్యం కార్డు అమలు విషయంలో మార్చిన నిబంధనల వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర రేషన్ సరుకులను పొందగలుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52,70,217 బియ్యం కార్డులు ఉన్నాయి.