లాక్ డౌన్ వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి భారీ నష్టం.. ఎన్ని కోట్లంటే..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. కరోనా విజృంభణ వల్ల ఏపీలో నెలల తరబడి బస్సులు డిపోలకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి 2,528 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సాధారణంగా బస్సులు నడవాల్సిన దూరంతో పోలిస్తే 78.84 కోట్ల కిలోమీటర్లు తక్కువగా నడిచాయని చెప్పారు. బస్సు సర్వీసులు మొదలైన తరువాత పరిమిత సంఖ్యలో మాత్రమే 50 శాతం సీటింగ్ కెపాసిటీతో బస్సులు నడిచాయి. కరోనా సమయంలో సైతం ఆర్టీసీ సర్వీసులను అందించింది.

కరోనా విజృంభణ వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 5,586 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా వీరిలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది నవంబర్ నెల నాటికి ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం 3,350 కోట్లు కాగా ఈ ఏడాది 827 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ జనవరి నెల నుంచి పల్లెలకు సైతం సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడపనుంది.

అయితే ఈ బస్సులకు సాధారణంగా వసూలు చేసే ఛార్జీలతో పోలిస్తే 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 45 వేల కిలోమీటర్ల మేర బస్సు సర్వీసులను పెంచాలని భావిస్తోంది. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో 5,200 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోనుందని సమాచారం.