Category Archives: Political News

Janasena: జనసేనలోకి వైసీపీ బ్యాచ్ ఎంట్రీకి నాగబాబు గ్రీన్ సిగ్నల్… షరతులు వర్తిస్తాయి?

Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు సంచలంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి అత్యధిక మెజారిటీ సొంతం చేసుకుని అధికారం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కూటమిలో భాగంగా జనసేన పార్టీ కూడా భాగమైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటూ ఒకప్పుడు ఆయనపై ఉన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇక జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పలు దిశా నిర్దేశాలు చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంచి స్థాయిలో ఉండే దీంతో ఎంతోమంది ఇతర పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా కార్యకర్తలు సైతం జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.

కేసులు పెట్టనివారు..
ఇలా జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కండిషన్లను కూడా పెట్టారు. జనసేన పరివారాన్ని ఇబ్బందులకు గురి చేయని.. కేసులు పెట్టని వారికి మాత్రమే జనసేన కండువా కప్పుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారని ఇటీవల నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.

Araa Mastan: కేకే సర్వే చూసి షాక్ అయ్యాను.. ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు?

Araa Mastan: ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 50 రోజులవుతున్న ఇప్పటికీ ఎన్నికల ఫలితాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే మరోవైపు సంక్షేమ ఫలాలను కూడా అందించారు అయితే ఈసారి ఎన్నికలలో తప్పకుండా తిరిగి తామే అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి పంపించాలని కూటమి కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ విషయంలో కూటమి సక్సెస్ అయిందని చెప్పాలి. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేవరకు కూడా ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే విధంగా తెలియజేశాయి కానీ కేకే సర్వే మాత్రం కూటమి ఘనవిజయం సాధిస్తుందని, కూటమి 161 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు.

ఇలా కేకే సర్వే చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు కానీ చివరికి ఆయన చెప్పినదే నిజం కావడంతో ఒక్కసారిగా కేకే సర్వే ఆల్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోయింది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన కేకే సర్వే గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
40 నియోజకవర్గాలు..

ఈ సందర్భంగా ఆరా మస్తాన్ మాట్లాడుతూ తాను అన్ని నియోజకవర్గాలలో శాంపిల్స్ తీసుకొని సర్వే చేయలేదని తెలిపారు. కేవలం 40 నియోజకవర్గాలలో మాత్రమే శాంపిల్స్ తీసుకొని అనంతరం ఫీడ్ బ్యాక్ ద్వారా ఫలితాలను తెలిపానని వెల్లడించారు. ఇక కేకే సర్వే గురించి ఈయన మాట్లాడుతూ..కేకే సర్వే చూసి షాక్ అయ్యానని, కచ్చితంగా ప్రిడిక్ట్ చేసిన అతన్ని అభినందించాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే కేకే సర్వే మెకానిజం, శాంపుల్స్ గురించి అక్కడ ప్రస్తావించలేదని గుర్తు చేశాడు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో తరచూ వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పలువురు ఈయన పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ సభలలో కూడా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హింసల గురించి పలు విషయాలు వెల్లడించారు 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం రాష్ట్రంలో హింసలను ప్రోత్సహించింది అని తెలిపారు.

నేను పుట్టినప్పటినుంచి నాపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా నాపై 17 కేసులు అలాగే పవన్ కళ్యాణ్ పై ఏడు కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు తెలిపారు. నాపై పెట్టిన కేసులు కారణంగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపే పరిస్థితికి తీసుకువచ్చారని తెలిపారు.

చట్టబద్ధంగా చేశారు..
ఇక అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది చట్టబద్ధంగానే చేశారు. నువ్వు (జగన్) కూడా తెగ కలవరిస్తున్నావ్ కావాలంటే పోయి కాపురం చెయ్యవయ్యా అన్నా నేను కూడా అని గుర్తు చేశారు చంద్రబాబు. వ్యక్తి గతంగా తీసుకురావద్దని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మహిళలను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు హెచ్చరించారు.

Pawan Kalyan : రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్..!

ఇప్పటి వరకూ మనం చూస్తున్న రాజకీయాలు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాలు వేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు అధికారంలో ఉన్నవారిని గుత్తాగానో.. లేదంటే సింగిల్‌గానో మూసేయాలి.. విపక్షం అనేది లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం పాలిటిక్స్‌లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. అయితే నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా అని ఏదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ పవన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ట్రెండ్ అంటారా? కక్ష సాధింపులకు చెక్ పెట్టాలనేది. ఏ అధికార పార్టీ అయినా కక్ష సాధింపులకు పాల్పడటం సర్వసాధారణం. పవన్ మాత్రం వద్దు అంటున్నారు. పైగా తను తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోండని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వాస్తవానికి ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. అదేదో నోటి నుంచి వచ్చిన మాటలా అనిపించలేదు. హృదయాంతరాల నుంచి వచ్చిన మాట. ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్. నిశ్శబ్దాన్ని చీల్చే మాట. సంచలనానికి నాంది పలికిన మాట. వాస్తవానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఏమాత్రం ఆశించలేము.

అవినీతి ఆస్కారం లేని పాలనను అందిద్దాం..

అధికారంలో ఉన్నవారు తప్పు చేసినా కూడా తాము తప్పు చేయలేదని గట్టిగా వాదిస్తుంటారు. అలాంటిది చేస్తే చర్య తీసుకోమన్నారు. పైగా తన పార్టీ నేతలను సైతం కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లవద్దని గట్టిగానే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వపన్ విభిన్నమైన రాజకీయం చేస్తున్నారు. ఎవరినీ విమర్శించడం లేదు. ప్రజా సమస్యలు.. అధికారులతో సమీక్షలు తప్ప మరి వేటిని పట్టించుకోవడం లేదు. బాధ్యతగా ఉండాలని చెప్పడం కాదు.. తాను బాధ్యతగా ఉండి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఒక హూందాతనాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుందని.. గత ప్రభుత్వం తప్పులు చేశారని మనమూ చేయనక్కరలేదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ రాజకీయ కక్షలు విరమించాలన్నారు. ఎవరైనా తప్పు చేస్తే.. చట్ట ప్రకారం వెళ్లాలి తప్ప వ్యక్తిగత దాడులకు దిగవద్దని సూచించారు. అవినీతి ఆస్కారం లేని పాలనను ప్రజలకు అందిద్దామని తెలిపారు.

జగన్ నానా రచ్చ చేస్తున్న తరుణంలో..

వాస్తవానికి ఇవన్నీ సినిమాల్లో మాత్రమే చూడగలం.. కానీ వాస్తవంలోనూ చూపిస్తూ పవన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తప్పు ఎవరు చేసినా.. చివరకు తానే చేసినా శిక్షకు సిద్ధమని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని పవన్ కోరారు. రాష్ట్రాన్ని పునర్మించుకునేందుకు అంతా కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నేలపై జన్మించిన మహానుభావులను పవన్ గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ వైసీపీ అధినేత జగన్ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కక్ష సాధింపు రాజకీయాన్ని ఎన్డీఏ చేస్తోందంటూ నానా రచ్చ చేస్తున్న తరుణంలో పవన్ మాటలను జనసైనికులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నెట్టింట పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

AP: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది… ఢిల్లీ ధర్నాలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

AP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఈయన ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ చూడటం కోసం రావాలని పలువురు పార్టీ నేతలను కూడా విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఇక నేడు ధర్నాలో పాల్గొనడం కోసం గత రాత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే ధర్నాలో పాల్గొన్నటువంటి ఈయన కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలియజేశారు.ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. లోకేశ్ రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని తెలిపారు.

రెడ్‌బుక్‌ హోర్డింగ్‌…
ఇలా ఢిల్లీలో ధర్నా చేసినటువంటి జగన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కాకుండా కూటమి ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ప్రధానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి అలాగే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

YS Sharmila: 15వేల కోట్లు మూస్టి పడేస్తే పండగ చేసుకోవాలా… బడ్జెట్ పై వైయస్ షర్మిల కామెంట్స్!

YS Sharmila: ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో చంద్రబాబు నాయుడు అమరావతి కోసం నిధులు తీసుకువచ్చారు అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా సమావేశంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు బిజెపి వీరందరినీ ఒక్కొక్కరిని వెయ్యి కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారా అంటూ ఈమె విమర్శలు చేశారు. కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం కేవలం 15 వేల కోట్ల రూపాయలకు చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కేంద్రం 15000 కోట్ల రూపాయలు ముష్టి వేస్తే పండగ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఎక్కడ..
బడ్జెట్లో ఎక్కడా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ఈమె తెలిపారు.బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్ 1200 పాయింట్స్ పడిపోయిందని తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని షర్మిల ప్రశ్నించారు.కర్నూల్, కోపర్తి దగ్గర ఇండ్రస్ట్రీ హబ్‌కి ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్ అంటే అంకెలకి సంబంధించిన అంశం అంటూ ఈమె బడ్జెట్ పై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

AP: ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం… మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు?

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు. ఇందులో భాగంగా తల్లికి వందనం కూడా ఒకటి. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికి 15000 రూపాయలను అందజేశారు.

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం సైతం స్థానం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చొప్పున అందజేస్తామని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిల్లలు పాఠశాలలకు కూడా వెళ్తున్న కానీ ఇప్పటివరకు ఈ పథకం గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు.

తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమ్మకు వందనం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అందజేస్తామని తెలిపారు. ఇక ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే వారితో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు..
అమ్మకు వందనం పథకానికి మార్గదర్శకాలు జారీ చేయడానికి మరికాస్త సమయం పడుతుందని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ జరగకూడదు అనేది మా లక్ష్యం అని తెలిపారు. ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 15000 రూపాయలు తప్పనిసరిగా అందజేస్తామంటూ ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.. ఇప్పటికే పాఠశాలలో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం అందకపోవడంతో పలువురు ఈ అమ్మకు వందనం పథకంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Kamal Hassan: కేంద్ర బడ్జెట్ పై కమల్ హాసన్ ఆసక్తికర ట్వీట్…త్వరలో INDIA బడ్జెట్ వస్తుందంటూ?

Kamal Hassan: ముచ్చటగా మూడోసారి మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇలా ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఈ విధంగా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పట్ల కొంతమంది తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఈయన స్పందిస్తూ..

NDA బడ్జెట్ సందర్భంగా శుభాకాంక్షలు అతి త్వరలోనే INDIA బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్న అంటూ ఈయన ట్వీట్ చేశారు. అయితే త్వరలోనే కూటమి ప్రభుత్వం కూలిపోతుందని తిరిగి ఐ ఎన్ డి ఐ ఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కాబోతుందన్న ఉద్దేశంతో కమల్ హాసన్ ఈ ట్వీట్ చేశారు. ఇక ఈయన చేసిన ట్వీట్ పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

భారతీయుడు 2 బడ్జెట్..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏం అసలు అర్థం కాలేదు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ముందు మీ భారతీయుడు 2 సినిమా బడ్జెట్ విషయాలు బయట పెట్టండి అంటూ ఈయనకు కౌంటర్ ఇస్తూ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

AP: హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరుకుతుంది.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామన్నారు.

పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని మండిపడ్డారు. ఆ నేరస్తుడి పాలనలో సీబీఐ వాళ్లు కూడా అరెస్టు చేయలేక వెనక్కి వచ్చారని గుర్తుచేశారు. అధికారం కోసం కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ప్లే చేశారని కోడి కత్తి డ్రామా సక్సెస్ అయిన గులకరాయి సక్సెస్ కాలేక పోయింది అంటూ జగన్ పై విమర్శలు చేశారు.

ఇక హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది అయితే ఈ ప్రశ్నకు అతి త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఆ సమాధానం కోసం ప్రతి ఒక్కరు కాస్త సమయం మనం పాటించాలని తెలియజేశారు. పులివెందల మాదిరిగానే రాష్ట్రాన్ని తయారు చేయాలని గత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని తెలిపారు.

హూ కిల్డ్ ఎన్టీఆర్…

ఎక్కడ చూసినా అధికారుల దోపిడీ జరిగింది ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు నేటిజన్స్ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ హూ కిల్డ్ ఎన్టీఆర్ ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుందా బాబు గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Revanth Vs BRS : రేవంత్, బీఆర్ఎస్.. ఎవరు నెగ్గుతారు? ఎవరు తగ్గుతారు?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అస్తమాను ఢిల్లీ పర్యటన పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్నా హస్తినకు తీసుకెళ్లి మరీ కండువా కప్పిస్తున్నారు. చూసేవారికి కూడా విచిత్రంగా అనిపిస్తోంది. ఏంటిది.. పదే పదే ఢిల్లీకి వెళుతున్నారు.. అసలు తెలంగాణలో పాలన పరిస్థితేంటని అంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే హస్తినలో మరోలా ఉందట. రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం క్లాసుల మీద క్లాసులు పీకుతోందట. కారణమేంటంటారా? రేవంత్ చెప్పిందొకటి చేస్తోంది మరొకటని ఏకి పారేస్తున్నారట.. వారానికోసారి ఢిల్లీకి ఈ రాకపోకలేంటని గట్టిగా క్లాస్ పీకేసిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఎందుకు రేవంత్‌ను ఏకాల్సిన అవసరం అధిష్టానానికి వచ్చిందంటారా? దానికో ఓ కారణముంది? అధిష్టానం చురకలతో రేవంత్ గట్టిగానే ఫిక్స్ అయ్యారట. ఈ న్యూస్ బయటకు రావడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయిపోయింది. ఏంటిది.. బోడిగుండుకు.. మోకాలుకు ముడిపెడుతున్నారని అనిపిస్తోందా? కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్‌ను తిట్టడమేంటి? ఆయన గట్టిగా ఫిక్స్ అవడమేంటి? దీనికి బీఆర్ఎస్ అలర్ట్ అవడమేంటి? అంటారా? అయితే ఈ కథనం చదవాల్సిందే..

ఒక్కొక్కరి చొప్పున ఎంతకాలం?

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్నది. పార్లమెంటు ఎన్నికల ద్వారా అయినా ఆ దెబ్బలకు కాస్త ఆయింట్‌మెంటు రాసుకుందామంటే.. ఈసారి ఏకంగా చావు దెబ్బే తగిలింది. అంతే.. బీఆర్ఎస్ ఖేత్ ఖతమ్. తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. ఇక కేసీఆర్ లక్కీ నంబర్ అయిన ఆరుపై రేవంత్ గురి చూసి మరీ కొడుతున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీల చొప్పున కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కారు పార్టీ ఖల్లాస్ అనడానికి లేదు కానీ రేవంత్ ప్లాన్ మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీ మినహా అందరినీ లాగాలని.. ఈ మంగమ్మ శపథాన్నే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద చేసి వచ్చారట. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి లాగిన వారిని ఒక్కొక్కరిని చొప్పున తీసుకెళ్లి కాంగ్రెస్ తీర్థం ఇప్పిస్తుంటే.. ఇచ్చేవారికైనా చిరాకు వస్తుంది కదా.. ఒక్కొక్కరి చొప్పున ఎంతకాలం పోయాలి? అందరినీ పట్టుకురా అంటోందట అధిష్టానం. ఇదీ కథ. బీఆర్ఎస్‌ను ఖతమ్ చేస్తానని శపథం చేసిన రేవంత్.. ఇలా వారానికొకరిని తీసుకెళ్లడం అధిష్టానానికి చిరాకు తెప్పించిందట. అందుకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట.

కంగుతిన్న రేవంత్..

ఇటీవల రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడే ఖర్గే ఆయనను వాయించి వదిలిపెట్టారని టాక్. అంతకు ముందేమో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తా.. అని ప్రగల్భాలు పలికి వెళ్లావు కదా.. మరి ఏంటిది? అని ప్రశ్నించారట. వారానికొకరిని తీసుకొచ్చి.. షో చేస్తున్నావేంటని ప్రశ్నించారట. విలీనం ఎంత వరకూ వచ్చిందని నిలదీశారట. మొత్తానికి ఈ వ్యవహారంతో కంగుతిన్న రేవంత్ రెడ్డి.. ఇకపై కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక తగ్గేదేలే.. మొత్తానికి గాలం వెయ్యాలి.. తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా కప్పించాలని డిసైడ్ అయ్యారట. విషయం కాస్త బీఆర్ఎస్‌కు లీక్ కావడంతో ఆ పార్టీ అలర్ట్ అయిపోయింది. ఇప్పటి వరకూ పోయిన వాళ్లు పోయారు.. ఇక ఉన్నవారినైనా కాపాడుకోవాలని భావిస్తోందట. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఇకపై చేజార్చుకోవద్దని బీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుందట. మరి ఇద్దరూ గట్టిగానే ఫిక్స్ అయ్యారు. మరి చివరకు ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి. ఈ మొత్తం వ్యవహారం మీద పాలనను గట్టెక్కించకుండా రేవంత్ చూసుకోవాలి. లేదంటే అసలుకే ఎసరు రావడం ఖాయం.