కేంద్రం నుంచి కొత్త పథకం..ఆ విద్యార్థులకు ఏడాదికి రూ.2 వేలు సాయం..!

పాఠశాల విద్య పూర్తికాకుండానే బడి మానేసిన వారిని మళ్లీ చదువుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 16-19 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. దూరవిద్య విధానంలో పది, ఇంటర్‌ చదవాలనుకునే వారికి సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కింద ఏడాదికి రూ.2 వేల మేర ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఈ పథక సాయాన్ని మొదటి సారిగా 2021-22 విద్యా సంవత్సరంలోనే అమలు చేయనున్నారు.

ఈ మొత్తాన్ని చదువుకు ఉపయోగపడే పరీక్ష ఫీజు, కోర్సు మెటీరియల్‌ వంటి ఖర్చులకు వినియోగించాల్సి ఉంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వీటిని విద్యార్థుల చేతికి ఇస్తే వేరే విధంగా ఖర్చు చేసే వీలుంటుందని.. వాటిని సార్వత్రిక విద్యాపీఠానికి ఇవ్వాలా? డీఈఓలకు ఇవ్వాలా? అన్న దానిపై స్పష్టత రాలేదు అని ఎస్‌ఎస్‌ఏ అధికారి ఒకరు తెలిపారు.

జిల్లా విద్యాధికారుల ఆమోదంతో ఎన్‌ఐఓఎస్‌ లేదా రాష్ట్రాల సార్వత్రిక విద్యాపీఠంలో చేరేవాళ్లకు ఈ ఆర్థిక సాయాన్ని వర్తింపజేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. తెలంగాణలో ఈ సాయం పొందేందుకు 3,500 మంది వరకు అర్హులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది.

2021-22 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠంలో పది, ఇంటర్‌ ప్రవేశాలు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. దీనిలో చదువుకు ఓసీ విద్యార్థికి రూ.1600 వరకు ఖర్చు అవుతోంది. ఇంటర్‌ విద్యకు ఏడాదికి రూ.1850 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూ.2వేలు కేంద్రం సాయం అందిస్తే ఈ భారం నుంచి విద్యార్థులు బయట పడే అవకాశం ఉంటుంది.