అమ్మాయిలకు ఉండే ఈ హక్కుల గురించి మీకు తెలుసా..?

దేశంలో రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. మనుషులు ఇతర గ్రహాలపై సైతం ప్రయోగాలు చేస్తున్నారు. అయితే మనుషుల ఆలోచనా తీరులో మాత్రం నేటికీ మార్పు రావడం లేదు. ఆడపిల్లల, మగపిల్లల విషయంలో వ్యత్యాసం చూపే కుటుంబాలు నేటికీ సమాజంలో ఉండటం గమనార్హం. ప్రోత్సాహం లేక అడుగడుగునా ఇబ్బందులు పడుతున్న యువతులు, మహిళలు సమాజంలో ఎంతోమంది ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా హక్కులు లభించకపోవడం వల్ల ఆడపిల్లలు వాళ్ల పొందాల్సిన కనీస సౌకర్యాలను సైతం అనుభవించలేకపోతున్నారు. ఆడపిల్లలకు ఉండే హక్కుల్లో మొదటిది జీవించే హక్కు. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల విషయంలో జీవించే హక్కు గౌరవించబడటం లేదు. చాలా కుటుంబాలలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయి పుట్టాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఉన్నా ఇంట్లో పెద్దల నిర్ణయాన్ని బట్టే ఆడపిల్లల చదువు ఆధారపడి ఉంటోంది.

ఆడపిల్లలకు ఉండే హక్కుల్లో ఆరోగ్యంగా ఉండే హక్కు ముఖ్యమైనది. అయితే చాలా దేశాలు ఆడపిల్లల ఆరోగ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫలితంగా ఆడపిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్లలకు ఉండే మరో హక్కు సురక్షితంగా ఉండే హక్కు. ఆడపిల్లలకు సురక్షితంగా ఉండే హక్కు ఉన్నా దేశంలో అత్యాచారానికి సంబంధించిన కేసులు పెరిగిపోతూ ఉన్నాయి.

మనుషుల ఆలోచనా తీరు మారితే మాత్రమే ఆడపిల్లలు తమ హక్కులను అనుభవించడం సాధ్యమవుతుంది. ప్రతి ఇంట్లో ఆడపిల్ల అయినా, మగపిల్లాడు అయినా ఇద్దరికీ అన్ని విషయాల్లో సమ ప్రాధాన్యత ఇస్తే ఇప్పటికే అనేక రంగాల్లో తమ ప్రతిభను ప్రూవ్ చేసుకుంటున్న ఆడపిల్లలు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉంటాయి.