2021లో తగ్గనున్న ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు.. నిజమేంటంటే..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అవుతున్న వార్తల్లో కొన్ని వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో 2021 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గనున్నాయంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ వార్త నిజమేనని భావిస్తున్నారు. 2020లో కరోనా విజృంభణ కేంద్రానికి దాదాపు మూడు నెలల పాటు భారీగా ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే.

పలు రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్లలో నేటికీ లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడంతో వేతనాలు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల దేశంలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల పరిస్థితే అంతోఇంతో మెరుగ్గా ఉండగా ప్రైవేట్ ఉద్యోగులలో చాలామంది ఉద్యోగాలను కొల్పోయి ఇబ్బందులు పడ్డారు.

వైరల్ అవుతున్న వార్తలో ప్రధాని నరేంద్ర మోదీ కార్మిక చట్టాల సవరణలో భాగంగా వేతనాలను తగ్గిస్తున్నారని… గ్రేడుల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను విభజించి వేతనాలను తగ్గించనుందని వార్త వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి స్పష్టతనిచ్చింది. వేతన కోడ్‌ బిల్లు-2019 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించదని తెలిపింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి స్పష్టతనివ్వడంతో వైరల్ అవుతున్న వార్తల గురించి ప్రభుత్వ ఉద్యోగులు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.