భారత్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ మృతి.. కానీ..?

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌ కు చెందిన మహిపాల్ సింగ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత మృతి చెందాడు. వార్డ్ బాయ్ గా పని చేసే మహిపాల్ సింగ్ ఛాతీలో నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో మృతి చెందాడు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదట కరోనా వ్యాక్సిన్ ను ఇచ్చారు.

46 సంవత్సరాల వయస్సు ఉన్న మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. వ్యాక్సిన్ ను తీసుకున్న 24 గంటల తరువాత ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయాడని మహిపాల్ సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడని సమాచారం. శనివారం కరోనా వ్యాక్సిన్ ను తరువాత మహిపాల్ మరింత అనారోగ్యానికి గురయ్యాడని మహిపాల్ కుమారుడు విశాల్ తెలిపారు.

జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసీ గార్గ్ మాత్రం కరోనా వ్యాక్సిన్ వల్ల మహిపాల్ మృతి చెందాడని అనుకోవడం లేదని మహిపాల్ మృతికి మరేదైనా కారణం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మహిపాల్ సింగ్ పోస్టుమార్టం రిపోర్ట్ లో అతను కార్డియో-పల్మనరీ డిసీజ్ వల్ల చనిపోయాడని వెల్లడైందని తెలిపారు. శనివారం రోజున యూపీ రాష్ట్రంలో 22,643 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని జనవరి 22వ తేదీన రెండో విడత టీకా పంపిణీ జరుగుతుందని అన్నారు.

మహిపాల్ కు గతంలో కరోనా వైరస్ సోకలేదని తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక వెల్లడైనా అతని కుటుంబ సభ్యులు మాత్రం కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మహిపాల్ సింగ్ తీసుకున్నారని సమాచారం.