సంతోషం సినిమా కోసం కొత్త దర్శకుడైనా దశరథ్ కోసం నాగార్జున 6 నెలలు ఎందుకు వెయిట్ చేశాడో తెలుసా ?

టాలీవుడ్ లో మన్మథుడుగా, కింగ్ గా నాగార్జున కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున తండ్రి లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వర రావు దగ్గర్నుంచి లేడీస్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ. అప్పట్లో ఏ.ఎన్.ఆర్..ఇప్పుడు నాగార్జున నటించిన ఫ్యామిలీ కథలు భారీ హిట్ అవడానికి కారణం ముఖ్యంగా ఇవే. మన్మథుడు సినిమా తర్వాత నాగార్జునకి అదే బాగా సూటవుతుందని అభిమానులు దాన్నే ఫిక్స్ చేశారు. ఇక నాగేశ్వర రావు – నాగార్జున ఇద్దరు కూడా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు.

అందుకు ఉదాహరణ ఏ.ఎన్.ఆర్ దర్శకుడిగా పరిచయం చేసిన కె విశ్వనాథ్ గారు, నాగార్జున పరిచయం చేసిన రాం గోపాల్ వర్మ. అన్నపూర్ణ బ్యానర్‌లో ఇప్పటికే చాలామంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే నాగార్జున ఎక్కువ బయట నిర్మాతలకి సినిమాలు చేసింది అంటే డి.శివ ప్రసాద్ రెడ్డి తోనే. 1985లో కామాక్షి మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి డి. శివప్రసాద్ రెడ్డి.. కార్తీక పౌర్ణ‌మి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్, కింగ్‌, కేడి, రగ‌డ‌, ద‌డ‌, గ్రీకు వీరుడు వంటి చిత్రాలను నిర్మించారు. వీటిలో దాదాపు అన్నీ సినిమాలు నాగార్జున చేసినవే కావడం విశేషం.

ఇక కథ విషయంలో అప్పట్లో నాగేశ్వర రావు గారి జడ్జ్‌మెంట్ ఎలా ఉండేదో ఇప్పుడు నాగార్జునది అలానే ఉంటుంది. నిర్మాణ వ్యవహారాలు నాగార్జున అన్న అక్కినేని వెంకట్ చూసుకుంటున్నప్పటికి కథ విని ఇది ఆడుతుందనే గట్టి నమ్మకంతో ఫైనల్ చేసేది మాత్రం నాగార్జుననే. ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్‌లో కథలు విని నాగార్జున వరకు తీసుకు వెళుతుంది ఆయన మేనకోడలు సుప్రియ. ప్రస్తుతం ఆమె ఫైనల్ చేసిన కథనే నాగార్జున వింటున్నాడు. ఒకవేళ కథ నచ్చిందంటే దానికోసం ఎన్ని నెలలైనా వెయిట్ చేయడం నాగార్జునకి అలవాటు.

అలానే గతంలో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కోసం 6 నెలలు పైగానే వెయిట్ చేశారు. ఆ సినిమానే సంతోషం. నాగార్జున నటించిన టాప్ 10 సినిమాలలో సంతోషం. తప్పకుండా నిలిచే సినిమా. అంతగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దశరథ్ తేజ వద్ద రచయితగా, అసోసియేట్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ పాయింట్ అనుకొని దాన్ని కథగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ పాయింట్ బావుందని నాగార్జునకి తెలిసి దశరథ్ ని పిలిచాడు.

నివ్వేదో కథ చేస్తున్నావట.. ఏంటది.. ఏ పాయింట్ మీద కథ రాస్తున్నావని అడిగారట. దాంతో దశరథ్.. సార్ నా దగ్గర పూర్తి కథ లేదు.. అవడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం 20 నిముషాల కథ మాత్రమే ఉంది. అన్నాడట. సరే ఆ 20 నిముషాల కథే చెప్పు అని నాగార్జున చెప్పాడట. నాగార్జున అలా అనగానే 20 నిముషాల కథ విని బాలేదని చెప్తారేమో అనే సందేహంతో వెళ్ళి కథ చెప్పగానే ..నీకు మొత్తం కథ తయారు చేయడానికి ఎన్ని నెలలు సమయం పడుతుందని దశరథ్ ని అడిగాడట. దానికి ఆయన 6 నెలలు ఖచ్చితంగా పడుతుందని సందేహం లేకుండా చెప్పాడట దశరథ్. సరే చేయ్..ఈ 6 నెలలు నేను ఇంకో సినిమా కమిటవను. మనం ఈ సినిమానే చేస్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయారట. అలా సంతోషం సినిమా చేయడానికి నాగార్జున 6 నెలలకి పైగానే వెయిట్ చేశారు. ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది.