Kakinada Shyamala : సిల్క్ స్మిత చనిపోవడానికి కారణం అదే… ఆమె ఆస్తులన్నీ ఎలా పోయాయంటే…: నటి కాకినాడ శ్యామల

Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామల గా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి అలాగే అలనాటి తారల జీవితాల గురించి వివరించారు.

సిల్క్ స్మిత అలాంటిది… ఆమె మరణానికి కారణాలు…

సిల్క్ స్మిత అనగానే మత్తు కళ్ళతో కుర్రకారుని పడేసిన ఒకప్పటి శృంగార దేవత. సిల్క్ ఒక్కసారి సినిమాలో కనిపిస్తే ఆ సినిమా హిట్ అనేంతలా క్రేజ్ సంపాదించుకున్న ఈ డస్కీ బ్యూటీ అసలు శృంగార తారగా 400 పైగా సినిమాల్లో నటించి అంతే త్వరగా తన జీవితాన్ని ఎలా ముగించుకుంది, ఆమె మరణించినా ఎవరూ ఆమెను ఎందుకు పట్టించుకోలేదు అనే విషయాలను కాకినాడ శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సిల్క్ స్మిత సినిమాల్లో ఎటువంటి పాత్రలు వేసినా నిజజీవితంలో చాలా మంచి అమ్మాయి అంటూ తెలిపారు. తాను సంపాదించిన డబ్బంతా ఒక్క సినిమాను నిర్మించే పోగొట్టుకుంది. అయితే మళ్ళీ సంపాదించి తాను బాకీ పడ్డ అప్పులన్నీ కట్టుకుంది. నాకు ఇవ్వవలసిన డబ్బు కూడా ఇచ్చేసింది. ఎవరికీ బాకీ లేదు, కానీ తాను ఎలా మరణించిందో మాత్రం ఆ దేవుడికే తెలియాలి. అప్పట్లో అది హత్య అని అనే వారు. హత్య, ఆత్మహత్య అనేది ఎవరికీ తెలియదు, దేవుడున్నాడు అన్నీ చూస్తాడు. ఆమె జీవితం అలా అవ్వడానికి కారణం అయిన వారిని వదిలిపెట్టడు అంటూ స్మిత గురించి శ్యామల చెప్పారు.