ఏపీ ప్రజలకు అలర్ట్.. దీపావళికి పాటించాల్సిన నిబంధనలివే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రేపు దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని ప్రజలు రేపు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చటానికి అనుమతులు ఇచ్చింది. గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ పండుగ నేపథ్యంలో బాణసంచా కాల్చటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బాణసంచాను బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాల్చాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాణసంచాను అంటించిన తరువాత పేలని పక్షంలో దానిని ప్రత్యక్షంగా తాకకుండా నీళ్లు చల్లాలని తెలిపారు. డబ్బాల్లో, సీసాల్లో బాణసంచా ఉంచి కాల్చవద్దని పేర్కొన్నారు. గుడిసెలు, వాములు, పెట్రోల్ బంకులకు దూరంగా బాణసంచాను కాల్చాలని చెప్పారు. పిల్లలు, అనారోగ్యంతో బాధ పడేవాళ్లు, ముసలివాళ్లు తక్కువ శబ్దం ఉన్న బాణసంచా కాల్చాలని సూచించారు.

అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక చికిత్సా సామాగ్రిని తయారు చేసుకోవాలని సూచనలు చేశారు. పర్యావరణహితమైన బాణసంచాను మాత్రమే కాల్చాలని చెప్పారు. పెద్దల సమక్షంలోనే పిల్లలు బాణసంచా కాల్చాలని తెలిపారు. కార్యాలయాలకు, ఆస్పత్రులకు దూరంగా బాణసంచా కాల్చాలని పేర్కొన్నారు.

అగర్ బత్తీలు, కొవ్వొత్తుల సహాయంతో బాణసంచా కాల్చాలని.. అగ్గిపెట్టెలను ఎక్కువగా ఉపయోగించకూడదని తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉండాలని చెప్పారు. బాణసంచాను గురింపు పొందిన దుకాణాలలో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.