Crime: పగలు భిక్షగాడు..! రాత్రి అయిందంటే చాలు పట్ట పగ్గాలు ఉండవు..!

Crime: పగటి పూట యాచకుడిగా.. రాత్రి పూట దొంగ మారుతున్న ఓ వ్యక్తి చివరికి ఓ వ్యక్తి ప్రాణాలను తీశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్నాడు… ఈక్రమంలో ఓ వ్యక్తి మరణానికిి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ తిరుమలగిరి సమీపంలోని కానాజీగూడకు చెందిన వరగంధం రాఘవుల నర్సింహ అలియాస్ నర్సింగ్(32) యాచకుడిగా జీవిస్తున్నాడు.

పగటి పూట సిగ్నళ్ల వద్ద యాచిస్తూ.. అక్కడే పుట్ పాత్ పై జీవిస్తున్నాడు. గతంలో అతని భార్య విడిచివెళ్లినందుకు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే గాయాలతో బయటపడ్డాడు.  ఇదిలా ఉంటే రాత్రి వేళ మాత్రం తనలోని మరో రూపాన్ని చూపిస్తుంటాడు నర్సింగ్.

మద్యం మత్తులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుంటూ.. దోపిడీలకు పాల్పడుతున్నాడు. మద్యం మత్తులో వెళ్లేవారిని అటకాయించి.. బెదిరించి వారివద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్లను దోపిడీ చేస్తున్నాడు. అలాగే పుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లను దొంగిలిస్తున్నాడు.ఇలాగే గతేడాది డిసెంబర్ 14న రాత్రి సమయంలో కొత్తపేట సమీపంలోని మార్గదర్శి కాలనీకి చెందిన అలుగుబెల్లి కృష్ణారెడ్డి(48) మెట్రోస్టేషన్ వద్ద మద్యం సేవించి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన నర్సింగ్… తన పాతపంథాలో భయపెట్టి దోచుకునేందుకు ప్రయత్నించాడు.

అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు…

అయితే కృష్ణారెడ్డి పెద్దగా పట్టించుకోవకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఈక్రమంలో కృష్ణారెడ్డి తల పుట్ పాత్ ను ఢీకొనడంతో తీవ్రగాయాలయి అక్కడే పడిపోయాడు. అతని వద్దనున్న సెల్ ఫోన్, రూ.100 నగదు దోచుకున్న నర్సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారేదాకా అక్కడే గాయాలతో పడి ఉన్న కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు వనస్థలి పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ… కృష్ణారెడ్డి 15 రోజుల తరువాత డిసెంబర్ 30న మరణించారు.  అయితే చోరికి గురైన మృతుడి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే మరొక వ్యక్తి ఫోన్ లిఫ్టు చేసి.. తనకు ఈ ఫోన్ దొరికిందని బుకాయించాడు. అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తే.. నర్సింగ్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. పుటేజీలో నిందితుడి ఫోటో ఆధారంగా.. ఆ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా కూపీలాగిన పోలీసులు నిందితుడు నర్సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీ చేసిన ఫోనును ఎల్బీనగర్ లో రూ. 300 విక్రయించగా.. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.