అక్క కోసం కిడ్నీ త్యాగం చేసిన తమ్ముడు.. నిజమైన రక్షా బంధన్‌కు అర్ధం చెప్పిన అక్కతమ్ముడు!

అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. నేడు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి రక్షా బంధన్‌కు నిజమైన అర్థం చెప్పాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న తన అక్కను రక్షించుకున్నాడు.

తన కిడ్నీని దానం చేసి ఆమె జీవితంలో వెలుగులు నింపాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. అయితే ఆమెకు రక్త పోటు కూడా ఉండటంతో పరిస్థితి విషమించిందని ఆకాశ్ హెల్త్‌కేర్ వైద్యులు తెలిపారు. ఆమెకు మొదట ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అవయవాలపై కూడా ప్రభావాన్ని చూపించినట్లు తెలిపారు. వెంటనే ఆమెకు డయాలసిస్ నిర్వహించడంతో.. ఆమె మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభించిందన్నారు. ఇది కాస్త ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి దారితీసింది.

దీంతో ఆమె వయస్సును పరిగణలోకి తీసుకొని కుటుంబసభ్యులకు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. వైద్యులు కిడ్నీ దానం చేసే వ్యక్తి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆ మహిళ కుటుంబసభ్యులే కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. మొదట ఆమె భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా.. అతడి బ్లడ్ గ్రూప్ సరిపోలేదు. ఆమె 28 ఏళ్ల తమ్ముడి బ్లడ్ గ్రూప్ సరిపోవడంతో అతడు కిడ్నీ దానం చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐదు గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి కిడ్నీ మార్పిడి పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ.. ‘ఆమె యువ వివాహిత మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఆమె కోరుకున్న సమయంలో తల్లి కావచ్చు’అని తెలిపారు.

కిడ్నీ దానం చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధితో తన అక్క చాలా బాధపడిందని.. ఆమె బాధను చూడలేక తాము తట్టుకోలేకపోయామని .. వైద్యులు తన కిడ్నీ సరిపోతుందని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని అన్నాడు. ఇక నుంచి తన అక్క సంతోషంగా ఉంటుందని.. అంతకంటే ఏం కావాలి అంటూ ఆమె సోదరుడు భావోద్వేగానికి గురయ్యాడు. అయితే రాఖీ పండుగ నేపథ్యంలో ఇలా తన కిడ్నీని దానం చేయడంతో నెటిజన్లు రాఖీ పండుగకు నిజమైన అర్థం ఇచ్చారంటూ ప్రశంసించారు.