దారుణం: నిశ్చితార్థానికి ముందు రోజే కబళించిన మృత్యువు!

తెల్లవారితే నిశ్చితార్థం.. కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా నిశ్చితార్థ పనులలో నిమగ్నమయ్యారు. అప్పటికే బంధువులు అందరూ ఇంటికి చేరుకొని ఎంతో కళకళలాడుతోంది. తెల్లవారితే శుభకార్యంతో సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంటిని మృత్యువు కబళించింది. తెల్లవారితే నిశ్చితార్థం జరుపుకోవాల్సిన యువతి మరణించడంతో ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల వివరాల మేరకు…

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట జయశంకర్‌ కాలనీకి చెందిన జెట్టూరి శేఖర్‌, సత్తమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు నవీన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె రోజా ఎమ్మెస్సీ ఫార్మసీ చదివి ప్రైవేట్ ల్యాబ్ లో పని చేస్తోంది. ఈ క్రమంలోనే రోజాకు వికారాబాద్ లో మిషన్ ఆస్పత్రి వైద్యునితో ఆమె వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం వీరి నిశ్చితార్థం కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి కొత్త దుస్తులను తీసుకురావడానికి రోజా తన స్నేహితురాలు మౌనికతో కలిసి మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో డిజైనర్‌ వద్దకు వెళ్లింది. ఆమె దుకాణంలో లేకపోవడంతో ఆమె కోసం దుకాణం బయట ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఆ భవనం మూడో అంతస్థు పైనుంచి పెద్ద రెయిలింగ్‌ శకలాలు ఆమె తల పై పడటంతో తీవ్ర గాయాలపాలైఉంది.

ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం రోజాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విధంగా బుధవారం తెల్లవారితే నిశ్చితార్థం జరుపుకోవాల్సిన యువతికి రైలింగ్ రూపంలో మృత్యువు సంభవించడంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. రెయిలింగ్‌కు పగుళ్ళు ఉన్నాయని యజమాని దృష్టికి తీసుకువెళ్లిన అతడు పట్టించుకోవడం లేదని అక్కడివారు తెలియజేశారు.