ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు శుభవార్త..!

భారతదేశంలో నివశించే వాళ్లకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎవరి దగ్గరైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసే ఏ స్కీమ్ కు అర్హులు కారు. దేశంలో రోజురోజుకు ఆధార్ కార్డ్ కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఏ పథకానికైనా ప్రస్తుతం ఆధార్ కార్డ్ నే ముఖ్యమైన ధ్రువపత్రంగా అధికారులు భావిస్తున్నారు ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి.

నవరవత్నాల హామీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లకు కూడా ఆధార్ తప్పనిసరి. ఆధార్ ప్రామాణికంగా తీసుకుని పథకాలను అమలు చేయడం ద్వారా పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కార్యాకలాపాలకు కూడా ప్రస్తుతం ఆధార్ కార్డ్ ప్రామాణికం అవుతోంది. దీంతో యుఐడీఏఐ వేగంగా ఆధార్ కార్డులు అందించే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఆధార్ కార్డ్ పొందడానికి నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. ప్రతి రాష్ట్రంలో నెలకు వేల సంఖ్యలో కొత్త కార్డులు జారీ అవుతున్నాయి. కొందరు ఆధార్ కార్డ్ లేక కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మరి కొందరు ఆధార్ కార్డ్ లో తప్పొప్పులను సరిదిద్దుకోవడం కోసందరఖాస్తు చేసుకుంటున్నారు.

ఏపీలో దాదాపుగా 5 కోట్ల 30 లక్షల ఆధార్ కార్డులు ఉండగా తెలంగాణలో దాదాపు 4 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు ఆధార్ కార్డులను వేగంగా జారీ చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు.