పబ్ లో చిన్నారి డ్యాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. చివరకు ఏం చేశారంటే..!

భాగ్యనగరంలో పబ్‌ నిర్వాహకులు నిబంధనలను గాల్లోకి వదిలేస్తున్నారు. పబ్‌లో ఓ చిన్నారి డ్యాన్స్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. 18ఏళ్ల లోపు వారిని పబ్‌లోకి అనుమతించకూడదనే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఎస్‌ఎల్‌ఎన్‌ టర్మినల్‌ వాణిజ్య సముదాయంలో ది లాల్‌ స్ట్రీల్‌ పబ్‌లో పదేండ్లలోపు చిన్నారి డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి.. సోషల్‌మీడియా ద్వారా సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

తన కుటుంబసభ్యులతో కలిసి చిన్నారి పబ్‌లోకి వచ్చింది. డీజే సౌండ్‌కు అనుగుణంగా డ్యాన్స్‌ చేసి సందడి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చిన్నారితో కలిసి పబ్‌కు వెళ్లిన తల్లిదండ్రులు ఆ పాపతో కలిసి డ్యాన్సులు చేసిన వీడియో ట్విటర్‌లో వైరల్‌ అయింది. మద్యం సేవించి నియంత్రణ కోల్పోయే అవకాశం ఉన్న వ్యక్తుల మధ్య చిన్నారి డ్యాన్స్‌ ఫ్లోర్‌పై నృత్యం చేయడం వల్ల ఆ బాలికకు ప్రమాదం జరిగి గాయపడే అవకాశం ఉందని నెటిజెన్లు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

ఈ దృశ్యాలను కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో లాల్‌స్ట్రీట్‌ పబ్‌పై చర్యలకు సైబరాబాద్‌ పోలీసులు సిద్ధమయ్యారు. చిన్నారిని పబ్‌లోకి అనుమతించిన ఎస్‌ఎల్‌ఎన్‌ టవర్స్‌లోని లాల్‌స్ట్రీట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపారు.

పబ్‌లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. చిన్నారిని పబ్‌లోకి ఎవరు తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పబ్‌ యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసని పోలీసులు దర్యాప్తు చేపడతున్నట్లు తెలిపారు.