క్లాస్ చిత్రాల దర్శకుడికి ప్రయోగాలు చేయాలని ఎందుకనిపిస్తోంది.. గతంలో దెబ్బతిన్నా కూడా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మారిన ఒక్కొక్కరికిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ దర్శకుడుని చూడగానే ఒక తరహా చిత్రాలు కళ్ళ ముందు కదలాడతాయి. ఉదాహరణకి ఆర్.నారాయణ మూర్తి అంటే విప్లవ సినిమాలు అని ఎవరినైనా అడగనవసరం లేదు. పైగా ఆయన సినిమాలు ఎక్కువశాతం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవని అంటుంటారు. కానీ ఆయన ఒకే జోనర్ తరహా చిత్రాలను తీసి ఒకదశలో భారీ విజయాలను అందుకున్నారు. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ గారి సినిమాలు అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలు ఎన్నేళ్ళ తర్వాత చూసుకున్న చక్కటి అనుభూతి కలుగుతుంది.

ఇక రాజమౌళి సినిమాలంటే ఒక ప్రత్యేకత, కొరటాల శివ సినిమాలంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలని, అనిల్ రావిపూడి సినిమాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అని ఒక మార్క్ పడిపోయింది. ఈ ముగ్గురు వరుస సక్సెస్‌లతో క్రేజీ డైరెక్టర్స్‌గా కొనసాగుతున్నారు. అదే క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ఒక మార్క్ పడింది. యూత్ ఎంటర్‌టైన్న్మెంట్స్, మంచి క్లాస్ సినిమాలను తెరకెక్కిస్తారని అందరిలో ఓ గుర్తింపు ఉంది. ఆయన కూడా పెద్ద హీరోలకి నేను మాస్ కథలను చెప్పి ఒప్పించలేను. నేను కథ చెప్పడానికి వెళితే హీరోలకి నన్ను చూసి నీరసం వస్తుందని చెప్పిన సందర్భం ఉంది.

శేఖర్ కమ్ముల సినిమాలంటే ఇప్పటి వరకు వచ్చినవన్నీ మనసుకు హత్తుకునేలా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటి, ఫిదా ..ఇలా అన్నీ ఆయన మార్క్ చిత్రాలే. వీటిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాను అందరూ హ్యాపీడేస్‌తో కంపేర్ చేయడం కూడా తెలిసిందే. తీసిన కథనే మళ్ళీ తిప్పి తీశాడని చెప్పుకున్నారు. ఇక ఫిదా సినిమా శేఖర్ కమ్ములకి మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌కి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవిల మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ సినిమా భారీ హిట్‌గా నిలవడానికి ప్రధాన కారణాలయ్యాయి.

ఇక తాజాగా నాగ చైతన్య – సాయి పల్లవిలతో లవ్ స్టోరి అనే ఎమోషనల్ లవ్ స్టోరి మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలిగించింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కోలీవుడ్ హీరో ధనుష్‌తో ఓ త్రిభాషా చిత్రాన్ని ప్రకటించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనుంది. అయితే తాజాగా ఈ సినిమా ఏ జోనర్‌లో తెరకెక్కించబోతున్నారో రివీల్ చేశారు. అలాగే రానాతో లీడర్ సినిమా సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు.

దాంతో లవ్ స్టోరి తర్వాత శేఖర్ కమ్ముల మీద కామెంట్స్ మొదలయ్యాయట. ఇన్నాళ్ళు క్లాస్ చిత్రాలు తీసిన దర్శకుడు థ్రిల్లర్ జోనర్ సినిమా ఏంటీ..అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఆయన గతంలో నయనతారతో అనామిక అనే సినిమా తీసి ఫ్లాప్ మూటకట్టుకున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన కహానీ సినిమాకి రీమేక్ ఇది. అప్పుడు అందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ధనుష్‌తో థ్రిల్లర్ సినిమా, అది కూడా పాన్ ఇండియన్ అనగానే రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇక రానాతో లీడర్ సీక్వెల్ అంటే కూడా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

2010లో రానాను హీరోగా పరిచయం చేస్తూ లీడర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. రానా లాంచింగ్ మూవీ అనా, లేక శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి పొల్టికల్ బ్యాక్ డ్రాప్ సినిమా వస్తుందనా..లేక ఇతర కారణాలతోనా అన్నది పక్కన పెడితే లీడర్ శేఖర్ కములకి కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయింది. అందుకే తాజాగా శేఖర్ కమ్ముల ధనుష్‌తో థ్రిలర్ మూవీని, రానాతో లీడర్ సీక్వెల్ అనగానే కొంత షాకవుతున్న జనాలు ఉన్నారు. చూడాలి మరి తనకి సక్సెస్ ఇవ్వని జోనర్ సినిమాలతో శేఖర్ కమ్ముల హిట్ ఇచ్చి చూపిస్తారేమో.