ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ. 5 వేలు సాయం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విద్య, వైద్య రంగాలతో పాటు పేదలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న వారికి 5 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

గత పది నెలల్లో జగన్ సర్కార్ ఏకంగా 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా కింద సాయం చేసింది. ఇందుకోసం ఏకంగా 134 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స పొందితే జగన్ సర్కార్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోందని వెల్లడించారు.

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కుటుంబ పెద్దలు కోలుకునే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం జగన్ ముందుచూపుకు ఈ నిర్ణయం మచ్చుతునక అని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 836 జబ్బులకు వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ ద్వారా సహాయం అందుతోంది. రోగి చికిత్స చేయించుకునే సమయంలోనే ఆస్పత్రి సిబ్బంది రోగికి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు.

ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రోగి ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నారనే వివరాలను బట్టి రోజుకు 225 రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు 5 వేల రూపాయలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరికైనా బ్యాంకు ఖాతా లేకపోతే వాళ్లు కుటుంబ సభ్యుల ఖాతాను ఇవ్వవచ్చు.