బైక్ పై పిడుగు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. అలుముకున్న విషాదఛాయలు..

నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కుండపోతగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే భారీ నుంచి అతి భారీవర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి.

పలు చోట్ల రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో పాటు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడ్డాయి. దీంతో జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్‌ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది.

ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే అతడు కూడా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంలో రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.