ప్రధానమంత్రి మోడీకి గిఫ్ట్ గా చీరను పంపిన పద్మ అవార్డు గ్రహీత..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ ప్రముఖ చేనేత కార్మికుడు బిరేన్ కుమార్ బసక్ నరేంద్రమోడీకి చీరను బహుమతిగా ఇచ్చారు. ఆ చీర పై దేశపౌరులతో పాటు నరేంద్ర మోడీ బొమ్మను చిత్రీకరించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ చేనేత కార్మికునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వెస్ట్ బెంగాల్ లోని నదియా ప్రాంతానికి చెందిన ఈయన భారత చరిత్ర సంప్రదాయాలను చీరలపై ఎంతో అద్భుతంగా ప్రతిబింబించేలా తయారుచేస్తారు. ఈ క్రమంలోనే ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడంతో ప్రధాన మంత్రిని కలిసిన సందర్భంలో బిరేన్ కుమార్ ప్రధానమంత్రికి ఈ చీరను బహూకరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బీరెన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం కోల్ కత్తాకి ట్రైన్లో వెళ్లి కలకత్తా వీధులలో తిరుగుతూ చీరలు అమ్మే వాళ్లమని అప్పట్లో ఒక చీర కేవలం 15 నుంచి 35 రూపాయల వరకు అమ్మే వాళ్ళని ఈ సందర్భంగా బిరేన్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఐదు వేలమంది కార్మికులతో తాను వ్యాపారం చేస్తున్నారని ఇందులో రెండు వేల మంది మహిళలు వారి స్వయం ఉపాధిని వెతుక్కునట్టు ఆయన తెలిపారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, ఆశా బోస్లే, లతా మంగేశ్కర్, సత్యజిత్ రే, హేమంత ముఖోపాధ్యాయ్ లాంటి వాళ్లందరూ తన కస్టమర్లని బీరేన్ పేర్కొన్నారు. ఇకపోతే ఈయన యూకే బెస్ట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడమే కాకుండా
2013లో స్కిల్ అండ్ క్రాఫ్ట్ మన్ షిప్ కు నేషనల్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం మోడీకి బహూకరించిన ఈ చీరకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.