Tag Archives: andhra pradesh

సామాన్యులకు మరో గుది బండ.. రూ.1000కి చేరువలో గ్యాస్ సిలిండర్ ధర..!

సామాన్యులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల పెరుగుదలతో పాటు వంటనూనె, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు వాణిజ్య సిలిండర్ ధర అమాంతం పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచింది. దాదాపు రూ.880 ఉన్న గ్యాస్ ధర రూ.1000 చేరువలోకి వచ్చింది.

ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటింది. డీజిల్ ధర రూ.100 కి చేరువవుతోంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులకు మరో భారం మోయాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.25 పెరిగింది. దీంతో రూ.910 నుంచి సిలిండర్ ధర రూ.1,000 కి పరుగులు పెడుతోంది.

అయితే సాధారణంగా ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. ఆగస్టు 1న ధరలు పెంచకుండా పాత ధరలనే కొనసాగించాయి. మళ్లీ సెప్టెంబర్ 1 వరకు ధరల్లో మార్పు ఉండదని సామాన్యులు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సామాన్యలుకు షాక్ తగిలినట్లయింది. గ్యాస్ ధరను రూ. 25 పెంచినట్లు ప్రకటించాయి.

దీంతో హైదరాబాద్ లో రూ.887 ఉన్న సిలిండర్ ధర రూ.912 కి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ రూ.859.5, ముంబైలో రూ.859.5, కోల్‌కతాలో రూ.886, చెన్నైలో రూ.875.50 ధరకు చేరుకుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి కూడా గ్యాస్ ధరలను కంపెనీ పెంచుకుంటూ వస్తోంది. ఈ ధరలు పెరగడం.. తగ్గడం అనేవి అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటుంది.

రైతన్నకు సిరులు కురిపించిన తెల్లబంగారం.. ఎక్కడంటే?

రైతులు పండించిన పంటలను కొందరు రైతులు వెంటనే మార్కెట్లో విక్రయిస్తుంటారు. దీంతో వచ్చిన డబ్బులను పెట్టుబడి పెడుతూ మరో పంటను సాగు చేస్తుంటారు. కానీ కొంత మంది పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే వాటిని కోల్డ్ స్టోరేజ్ లల్లో దాచుకుంటారు. అయితే ఒక్కోసారి రైతులు పండించిన పంటకు ఎక్కడా లేని ధర పలుకుతుంది.

అలాంటిదే అక్కడ తెల్లబంగారం (పత్తి) పండించిన రైతులకు నిజంగానే బంగారం కురిపించినట్లు అయింది. వాటి ధరలు మాత్రం ఏకంగా ఆకాశాన్ని తాకాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా 8వేల 80రూపాయలు పలికింది. డివిజన్‌లోని ఏరిగేరి గ్రామానికి చెందిన రైతు కిష్టప్ప.. తాను పండించిన పత్తిని ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చారు.

ఆ రైతుకు చెందిన పత్తి గరిష్టంగా క్వింటారూ. 8వేల 80రూపాయలకు వ్యాపారి కొనుగోలు చేసినట్లు యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రికార్డ్ స్థాయి ధరలు ఖరీఫ్ సాగుకు ముందు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారుల మధ్య పోటీ కారణంగానే ఇలా రోజు రోజుకూ ధరలు పెరుగుతున్నాట్లు చెబుతన్నారు.

రైతుల వద్ద కొత్త దిగుబడుల నిల్వలు లేకపోవడం పరిశ్రమలకు అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెరగడానికి కారణమైంది. నేటి వరకు పంటను దాచుకున్న రైతులు ధరలు పెరగడంతో మార్కెట్ కు తీసుకొస్తున్నారు.

400 మంది మహిళలను మోసం చేశాడు.. విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు..!

పోలీస్టేషన్ లోని జైలుకు వెళ్లాలంటే ఎవరైనా భయపడతారు. ఆ ఎఫెక్ట్ పల్లెటూరు వాళ్లకు అయితే జీవితాంతం మర్చిపోరు. అయితే ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడి జైలు కెళ్లడం అలవాటు అయిపోయింది. దొంగతనం చేయడం పోలీసులకు దొరికిపోయి జైలుకెళ్లడం మనోడికి అలవాడు. అతడు తన చదువును మధ్యలోనే ఆపేశాడు. దొంగ కళను మాత్రం కొనసాగించాడు.

ఇలా చోరీలు చేసి చేసి అతడికి బోర్ కొట్టిందో ఏమో.. గానీ మరో అవతారమెత్తాడు. ఇప్పుడు తన చూపు అంతా సోషల్ మీడియాలో పడింది. ఫేస్ బుక్, ఇన్ స్టా మరియు ట్విట్టర్ లల్లో అందమైన అమ్మాయిల పేరుతో ఫేక్ ఖాతాను తెరుస్తాడు. తర్వాత అమ్మాయిలను టార్గెట్ చేసి.. ముగ్గులోకి దించుతాడు. వాళ్లతో ప్రేమలో పడినట్టు నటించి న్యూడ్ వీడియోలు సంపాదిస్తాడు. వీటిని అడ్డుపెట్టుకొని వారిని బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నాడు.

చివరకు పోలీసులకు చిక్కి మళ్లీ జైలు బాట పట్టాడు. ఇలా స్మార్ట్ గా దోచుకుంటున్న వ్యక్తిది ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దటూరు. ఇతని పేరు ప్రసన్నకుమార్. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. 2017లో చైన్ స్నాచింగ్, తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

రెండు సంవత్సరాలు జైలు గడిపిన తర్వాత 2019లో బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చి తన రూటు మార్చేశాడు. షేర్ చాట్ లో పరిచమైన శ్రీనివాస్ అనే వ్యక్తికి హైదరాబాద్ లోని సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. దీంతో అతడిని పోలీసులు పట్టుకొని విచారించగా విషయాలు అన్నీ బయటకు వచ్చాయి. ఇలా అతడు తెలంగాణ, ఏపీలో 400 మంది అమ్మాయిలు, మహిళలను బెదిరించినట్లు తలిసింది.

హెల్మెట్ ధరించని పోలీసులకు కూడా జరిమానా… ఎక్కడంటే?

మామూలుగా మనం ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పోలీసుల కోసం ధరించడం కాకుండా మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ధరించాలి. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు ఏమాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు.ఈ విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి పోలీసులు జరిమానా విధించడం మనం చూస్తుంటాము. ప్రజలకు జరిమానా విధించిన పోలీసులు సైతం కొన్నిసార్లు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. మరి వారికి జరిమానా విధించరా.. అంటూ సామాన్యులు ఎన్నోమార్లు ప్రశ్నించారు.

తాజాగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్నటువంటి పోలీసులకు కూడా గట్టి దెబ్బ తగిలింది. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 27 మంది పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది.జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రధాన కూడళ్ల వద్ద, పోలీస్ క్వార్టర్స్ దగ్గర భారీ ఎత్తున మోహరించారు.

ఈ క్రమంలోనే హెల్మెట్లు లేకుండా బయటకు వచ్చిన 27 మంది పోలీసులకు అక్కడే జరిమానా విధించి డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా ఒక్కరోజులోనే 27 మంది పోలీసులకు జరిమానా విధించిన ట్రాఫిక్ డీఎస్పీని.. ఎస్పీ అభినందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం తప్పుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. కేవలం హెల్మెట్ ధరించని 27 మంది పోలీసులు మాత్రమే కాకుండా, హెల్మెట్ ధరించనీ సాధారణ ప్రయాణికులకు వంద మందికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ బియ్యం కిలో రూ.300.. డిమాండ్ ఎక్కువ.. ప్రయోజనాలు అధికం!

ప్రస్తుతం మార్కెట్లో మనకు వివిధ రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న రకం నల్లబియ్యం.ప్రస్తుతం మార్కెట్లో ఈ నల్ల బియ్యానికి బాగా డిమాండ్ పెరిగింది. 2 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లాలో అర ఎకరాలో సాగు చేసిన ఈ బియ్యం తాజాగా 20 ఎకరాలలో సాగు చేస్తున్నారు.ఈ విధమైనటువంటి నల్ల బియ్యాన్ని క్రిమిసంహారక మందులతో కాకుండా పూర్తిగా జీవ ఎరువులతో తయారు చేయటం వల్ల ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడింది.

సాధారణ వరి రకం ఎకరానికి 25–30 బస్తాల దిగుబడి వస్తే ఈ నల్లబియ్యం మాత్రం ఎకరాకు 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది. బ్లాక్ రైస్ ను రైతులు కిలో 170 నుంచి 180 వరకు విక్రయించగా మార్కెట్లో మాత్రం కిలో ధర ఏకంగా 300 నుంచి 350 వరకు ధర పలుకుతోంది.ఈ విధంగా ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడటానికి కారణం ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటమే.

నల్ల బియ్యంలో అత్యధికంగా ఆంకోసైనిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లుగా ఉంటాయి. ఇవి నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేసి మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కల్పిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకపాత్ర పోషిస్తాయి.విటమిన్‌–బి, ఇ, నియాసిన్,క్యాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి కనుక ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది.

నల్ల బియ్యాన్ని కేవలం జీవ ఎరువులతో తయారు చేయటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించడం వల్లే ఈ బియ్యానికి మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎంతో డిమాండ్ ఉన్న ఈ పంటను ఎక్కువ సాగు చేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు.అందుకు గల కారణం ఇవి చాలా ఎత్తు పెరగటం వల్ల చిన్నపాటి గాలి వీచిన పంట మొత్తం నాశనం అవుతుంది.

నువ్వు పురుషుడివేనా నిరూపించుకో అంటూ పింఛన్ అడిగిన వృద్దుడికి వింత పరీక్షా?

ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్ధుడికి ప్రభుత్వ అధికారులు ఓ వింత పరీక్ష పెట్టారు. 60 సంవత్సరాలు పైబడటంతో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఆ వృద్ధుడు చూపును కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతను ఈ వయసులో తన పురుషుడని నిరూపించుకుంటూనే తనకు పింఛను అందుతుందని అధికారులు కండిషన్ పెట్టారు. లేకపోతే తనకు పింఛన్ రాదని అధికారులు తేల్చి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లా,గంగాధర నెల్లూరు మండలం వీరకనెల్లూరుకు చెందిన వృద్ధుడు నామాల నాగయ్యకు ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది.

బాధితులు తెలిపిన వివరాల మేరకు నాగయ్య ఇదివరకు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో నాగయ్య కంటిచూపును కోల్పోవడంతో ప్రభుత్వం నుంచి అంధత్వ దృవీకరణ పత్రాన్ని పొందాడు.ఈ క్రమంలోనే ధ్రువీకరణ పత్రం ఆధారంగా తనకు వృద్ధాప్య పింఛన్ కాకుండా వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని అధికారులను విన్నవించుకున్నాడు.

నాగయ్య ఇదివరకు వితంతు పెన్షన్ అందుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారక వెబ్ సైట్ లో ఉంది. రేషన్ కార్డులో నాగయ్య పురుషుడిగా నమోదయింది. ఈ క్రమంలోనే నాగయ్య పురుషుడిగా నిరూపించుకుంటే అతనికి పెన్షన్ అందుతుందని లేకపోతే పెన్షన్ రాదని అధికారులు ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కూడా రద్దు చేస్తూ నాగయ్యకు నోటీసులు జారీ చేశారు.

ఈ విధంగా అధికారులు జారీ చేసిన నోటీస్ అందగానే 15 రోజుల లోగా అతడు పురుషుడని నిరూపించుకుంటేనే అతనికి పెన్షన్ అందుతుందని అధికారులు నోటీసులో తెలియపరచడంతో సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కు వచ్చి నాగయ్య తన సమస్యను అధికారులకు తెలియజేశారు. నాగయ్య సమస్యను విన్న అధికారులు అతనికి సహాయం చేస్తామని ఎంతో సానుకూలంగా స్పందించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

కరోనా వేళా.. వైసీపీ ఎమ్మెల్యే పెద్ద మనసు?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.చివరికి కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో శవాలు శవాగారంలోనే ఉండిపోయాయి. ఈ విధంగా అనాధలుగా మిగిలిపోయిన వారి శవాలకు దహన సంస్కారాలను నిర్వహించడానికి తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.

కరోనా మొదటి వేవ్ లో చనిపోయిన ఎంతోమందికి దహన సంస్కారాలను నిర్వహించిన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్నో శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధంగా తమ వంతు సహాయం చేస్తూ ప్రజల్లో ఎంతో అవగాహన చేపడుతున్నారు. తాజాగా తిరుపతిలో బుధవారం
రుయా మార్చురీలో కోవిడ్ వల్ల చనిపోయిన 21మందికి సాంప్రదాయ రీతిలో దహన సంస్కార కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వల్ల మరణించిన వారి దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.గత ఏడాది తన మిత్రులు, సహచరులు ముస్లిమ్ జేఎసి గా ఏర్పడి అన్నీతామై నేటివరకు 501 మృతదేహాలకు అంతిమ క్రియలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఎమ్మెల్యేగా తన వంతు భాద్యతగా ఈ దహన సంస్కారాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం 21 ఒక్క శవాలకు పూలమాలను వేసి వారి సంప్రదాయ పద్ధతులలో అంత్యక్రియలు నిర్వహించి తన గొప్ప మనసును చాటుకున్నారు.

ఇంటర్ పరీక్షల పై వెనక్కు తగ్గిన ఏపీ సర్కార్!

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా,చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలోనూ వివిధ పరీక్షలను వాయిదా వేశారు.కానీ ఏపీలో మాత్రం యధావిధిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని చెప్పిన ఏపీ ప్రభుత్వం చివరికి ఇంటర్ చదివే విద్యార్థుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగిన తరువాత తిరిగి పరీక్షలను నిర్వహిస్తామని, త్వరలోనే పరీక్ష తేదీలను వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి 22 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా మే 6 నుంచి 23 వరకు రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

ఈ క్రమంలోనే కరోనా కేసులు అధికమవుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించవద్దని పలు పార్టీలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు పరీక్షల నిర్వహణ పై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. తొందరలోనే పరీక్ష నిర్వహణ తేదీలను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

లాక్ డౌన్ గ్యారెంటీ.. రెండు వారాలకు సరిపడ సరుకులు తెచ్చుకోండి!

కరోనా రెండవ దశ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో లాక్ డౌన్ అమలు చేయడం ఎంతో శ్రేయస్కరం అని భావిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించారు.

ఈ క్రమంలోనే మరోసారి లాక్ డౌన్ విధిస్తే తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే గ్రహించిన వలస కూలీలు పెద్ద ఎత్తున సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. ఒకప్పుడు గ్రీన్ జోన్లుగా ఉండే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ప్రస్తుతం అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు జిల్లాలలో లాక్ డౌన్ విధించాలని అధికారులు అడుగులు వేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ విధించాల లేదా అనే అంశంపై అక్కడి ప్రజలను ప్రశ్నిస్తే అందుకు వారు లాక్ డౌన్ విధించాలనే చెబుతున్నారు. 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే ఈ మహమ్మారిని కొంత వరకు కట్టడి చేయవచ్చని అక్కడి ప్రజల ఉద్దేశం. ఈ క్రమంలోనే రెండు వారాలకు సరిపడానిత్యావసర వస్తువులను తాము ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఈ రెండు జిల్లాలలో కంటెంట్మెంట్ జోన్లను విధించగా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఇటువంటి సమయంలోనే లాక్ డౌన్ అమలు చేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై గతంలో మాదిరిగా శిక్షించాలని, ప్రాణం కన్నా లాక్ డౌన్ మిన్న అంటూ అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.

పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. కారణం?

సాధారణంగా ఖాకీడ్రెస్ లో ఉన్న పోలీసులను చూస్తే ప్రజలు భయంతో హడలిపోతుంటారు. వారు ప్రజల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తారనే భావన ప్రజలలో లోతుగా నాటుకుపోయింది. కరోనా కష్టకాలంలో పోలీసుల మంచితనం బయట పడటం వల్ల అందరిలో పోలీసులపై ఉన్న భావనను కరోనా చేరిపిందని చెప్పవచ్చు. వారిలో కఠినత్వం మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉందని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తాజాగా ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మర్రెపాలెం గ్రామానికి రెండు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఓ అనాధ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్సై వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, సురేష్ లను ఈ సంఘటన స్థలానికి పంపించారు. అయితే ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎవరు సాయంగా లేకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ సురేష్ స్వయంగా ఆ శవాన్ని అటవీ ప్రాంతం నుంచి రెండు కిలో మీటర్ల దూరం వరకు మోసుకొచ్చారు.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ఆ శవాన్ని తీసుకు రావడానికి భయంతో ప్రజలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ ఆటో డ్రైవర్ సహాయంతో కానిస్టేబుల్ సురేష్ ఒక కర్రకు మృతదేహాన్ని కట్టి భుజాలపై రెండు కిలోమీటర్ల దూరం వరకు మోసుకొచ్చారు. అనంతరం ఆ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఒక అనాధ శవం పట్ల హెడ్ కానిస్టేబుల్ సురేష్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ శవాన్ని ఆస్పత్రికి తరలించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం ఎంతోమంది నెటిజన్లు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.