కరోనాకు దేవత విగ్రహ ప్రతిష్ట.. ప్రత్యేక పూజలు?

సాధారణంగా మనకు ఏదైనా ఆపదవచ్చినప్పుడు, లేదా కరువు ఏర్పడినప్పుడు వర్షాలు కురవాలని,అనావృష్టి పరిస్థితుల నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున తమ గ్రామ దేవతలకు పూజలు నిర్వహించడం, బలిదానాలు చేయడం వంటివి చూస్తుంటాము.ఈ విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని శాంతింప చేయడం వల్ల ఆ గ్రామంలోని ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తారు.

ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఎంతో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని, ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని వేడుకుంటూ కోయంబత్తూరులోని ఓ దేవస్థానం కరోనా దేవతను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు, మహాయాగం చేపట్టనుంది.తమిళనాడులోని కామాచ్చిపురి ఆధీనంలో ఇటువంటి భయంకరమైన వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడం కోసం విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం పూర్వం నుంచి ఒక ఆచారంగా వస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించనున్నట్లు కామాచ్చిపురం అధీనం ఇన్‌చార్జి శివలింగేశ్వర్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటం కోసమే 48 రోజుల పాటు కరోనా దేవతకు మహాయాగం చేస్తున్నట్లు ఈ యాగానికి భక్తులేవరిని అనుమతించడం లేదని శివ లింగేశ్వర్ తెలిపారు.

ప్రజలను భయాందోళనకు గురిచేసే వ్యాధులకు ఈ విధంగా ప్రత్యేక పూజలు హోమాలు చేయడం ఇది కొత్తేమీ కాదు, ఇదివరకే ఎంతో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు కోయంబత్తూరులోని ప్లేగు మారియమ్మన్ ఆలయమే నిర్మించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. గతంలో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్లేగు మారియమ్మన్ దేవతలను పూజించినట్లే ప్రస్తుతం కరోనా దేవతను ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.