శుభలేఖ వల్ల ఆగిపోయిన పెళ్లి.. చివరికి ఇలా?

సాధారణంగా పెళ్లి కార్యక్రమంలో శుభలేఖకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ శుభ లేఖ ద్వారా పెళ్లికి బంధువులు అందరినీ ఆహ్వానిస్తున్నాము. అయితే అదే శుభలేఖ ఓ జంటను విడదీయడానికి కారణమయింది. సాధారణంగా పెళ్లిళ్లు చివరి క్షణాల్లో కూడా ఆగిపోతాయి. అయితే పెళ్ళిలో వధూవరులు కుటుంబసభ్యులు గొడవలు కారణంగా, లేదా వధూవరులు ఎవరినైనా ప్రేమించి ఉంటే వారి కోసమో చివరి క్షణాలలో వాయిదా పడుతుంటాయి. కానీ శుభలేఖ ద్వారా పెళ్లి వాయిదా పడిన ఘటన మహారాష్టలోని నాశిక్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రముఖ నగల వ్యాపారి ప్రసాద్ అద్గావ్కర్ కుమార్తె రసిక అంగ వైకల్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు ఎలాంటి సంబంధాలు కుదరకపోవడంతో ఆమె పెళ్లి జరగడం లేదు. ఈ క్రమంలోనే ఆమె స్నేహితుడు ఆశిఫ్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకోడానికి ముందుకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉండటంతో ఈ పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు జరగవని భావించారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సమక్షంలో నాసిక్ కోర్టులో వీరి పెళ్లిని రిజిస్టర్ చేశారు. జులై 18న స్థానిక ఓ హోటల్‌లో పెళ్లి వేడుక నిర్వహించాలని భావించారు.

ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుక కోసం ఇరు కుటుంబాలు వివాహ ఆహ్వాన పత్రిక తయారు చేయించాయి. ఈ శుభలేఖ వాట్సప్ ద్వారా చాలామందికి చేరుకోవడంతో అసలు సమస్య వచ్చి పడింది. బలవంతంగా యువతిని ఒక ముస్లిం యువకుడు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని ఆరోపణలు తలెత్తాయి.ఇది కచ్చితంగా ‘లవ్ జిహాద్’ అంటూ నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే కొందరు కమ్యునిటీ పెద్దలు వధువు తండ్రి ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ వేడుకను నిర్వహించవద్దంటూ ప్రసాద్ మీద ఒత్తిడి తెచ్చారు. అదేవిధంగా మరికొందరు తనకు ఫోన్ చేసి ఈ పెళ్లి జరిపించకూడదని బెదిరించారు. ఈ క్రమంలోనే వధువు తండ్రి వీరి వివాహాన్ని రద్దు చేశాడు.అయితే వీరి పెళ్లి కోర్టులో రిజిస్ట్రేషన్ కావడంతో వీరిరువురు కలిసి జీవించినా ఎలాంటి సమస్యలు ఉండవని పలువురు వ్యక్తం చేస్తున్నారు.