కేసీఆర్ ను తిట్టారని.. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు..!

సీఎం కేసీఆర్ చేసే పనులను ఎత్తిచూపుతూ.. ప్రతి పక్షాలు దమ్మెత్తి పోస్తుండటం చూస్తున్నాం. అలాగే ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట కూడా వాస్తవమే. అయితే అధికారంలో ఎవరు ఉన్నా దాదాపు.. సీఎంపై నెగెటివ్ ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు సీఎం అంటే.. ఆ పార్టీ అంటే పడని వారు.

ఇక్కడ జరిగిన ఘటనలో దానికి విరుద్దంగా జరిగిందనే చెప్పాలి. సీఎం కేసీఆర్ కు ఉద్యమకాలం నుంచి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఉద్యమనాయకుడిగా పేరు పొంది రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అయితే ఇదే అభిమానులు కేసీఆర్ ను సోషల్ మీడియాలో తిడితే.. వెంటనే స్పందించి.. ఎదురుదాడికి పాల్పడే వారు ఉంటారు.

కేసీఆర్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఆయనకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది కూడా కేసీఆర్ కోసం. అదేంటి అనుకుంటుంన్నారా.. సీఎం కేసీఆర్ ను సోషల్ మీడియాలో మరియు బయట ప్రతిపక్షాలు తిడుతున్నారని.. రాజ్‌భవన్ ఎదుట సూర్యాపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాగార్జున ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాజ్ భవన్ కు వస్తుండగా.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు స్పందించి.. వెంటనే అడ్డుకొని సదరు వ్యక్తిని కాపాడారు. సీఎం కేసీఆర్ తనకు దేవుడు లాంటి వాడని.. ఎవరైనా కేసీఆర్ ను తిడితే తాను తట్టుకోలేనని.. అటు ప్రతిపక్షాలు తిడుతుంటే తట్టుకోలేకపోతున్నానని అతడు వాపోయాడు. కేసీఆర్ కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదని తాను అనుకున్నట్లు చెప్పాడు. అందుకే ఇటువంటి పనికి పూనుకున్నట్లు తెలియజేశాడు.