ఆదిత్య 369 సినిమా సమయంలో తరుణ్ వయసు ఏంతో తెలుసా? ఆ సినిమా విశేషాలు తరుణ్ మాటల్లో..

ఆదిత్య 369 సినిమా తెలుసు కదా. ఆ సినిమా రిలీజ్ అయి మొన్నటికే 30 సంవత్సరాలు అయింది. అసలు.. 30 ఏళ్ల కిందనే టైమ్ మిషన్ ను కనిపెడితే.. భవిష్యత్తులోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపించిన సినిమా అది. నిజంగా ఆ సమయంలో ఆ కథ రాసిన వాళ్లు గ్రేట్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. టైమ్ మిషిన్ ఉంటే.. భవిష్యత్తులోకి వెళ్లి ఏం చేయగలమో చెప్పిన సినిమా అది. అప్పట్లో ఆ సినిమా సంచలనాలను సృష్టించింది.

ఆదిత్య 369 సినిమాలో హీరోగా బాలకృష్ణ నటించారు. ఆయన ఆ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అయితే.. ఆ సినిమాలో హీరో తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో తరుణ్.. ఆ సినిమా గురించి.. విశేషాలు తన అభిమానులతో చెప్పుకొచ్చారు.

అటువంటి సినిమాలను చేయాలంటే గట్స్ ఉండాలి

ఆదిత్య 369 లాంటి సినిమాలను చేయాలంటే చాలా గట్స్ ఉండాలంటూ తరుణ్ తెలిపారు. ఫ్యూచరిస్టిక్ సినిమా అనేది అప్పట్లో కొత్త సబ్జెక్ట్. భవిష్యత్తును టైమ్ మిషన్ తో చూడటం అనేది ఒక కల మాత్రమే. దాన్ని నిజం చేసి.. సరికొత్త కథతో 30 ఏళ్ల కింద అటువంటి సినిమా రావడం.. అటువంటి ప్రతిష్ఠాత్మకమైన సినిమాతో నేను భాగస్వామ్యం అవడం నా అదృష్టం.. అని తరుణ్ చెప్పారు.

బాలకృష్ణ అప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు

ఈ సినిమా ఇంత సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కారణం దర్శకనిర్మాతల తర్వాత బాలకృష్ణదే. బాలకృష్ణను చూసి అప్పట్లోనే చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన నుంచి క్రమశిక్షణ ఎక్కువగా నేర్చుకున్నా. ఆయనకు నటన మీద ఎంతో గౌరవం ఉంటుంది. సెట్ లోకి ఒక్కసారి వచ్చారంటే.. పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన ఇప్పటికీ కలిసినప్పుడల్లా.. అమ్మానాన్న ఎలా ఉన్నారు? అంటూ ముందు ఆ ప్రశ్నే అడుగుతారు. బాలకృష్ణ నిజంగా లెజెండ్ అంటూ బాలకృష్ణను పొగడేశారు తరుణ్.

బాలకృష్ణతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాలు చేశాను

బాలకృష్ణతో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాలు చేశాను. ఒకటి ఆదిత్య 369, మరొకటి తల్లిదండ్రులు అనే మూవీ. రెండు సినిమాల్లో బాలకృష్ణతో నటించడం అనేది నా అదృష్టం.. అని తరుణ్ చెప్పారు. ఆదిత్య 369 సినిమా చేసినప్పుడు నాకు 7 ఏళ్లు మాత్రమే. అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయం మొత్తం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే.. టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ ఉండటం, మ్యూజియంలో షూటింగ్ జరగడం.. ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అందుకే.. ఆ షూటింగ్ జరిగిన రోజులన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటా. ఆ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ నాకు ఇప్పటికీ గుర్తున్నారు.. అని ఆ సినిమా గురించి తన అనుభవాలను తరుణ్ ప్రేక్షకులతో పంచుకున్నారు.