Featured

నందుల పంట పండిన “సిరివెన్నెల” సినిమా.. ఓ క్లాసికల్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.!!

Published

on

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…”విరించినై విరచించితిని ఈ కవనం.. ప్రాగ్ధిశ వీనియా పైన దినకర మయూఖ తంత్రులపైన”… వేదాలు, ఇతిహాసాల కలయిక భరత ఖండం.. సిరివెన్నెల చిత్రం సినీజగత్తులో ఓ అద్భుతమైన కళాఖండం. ఆ చిత్రం శాస్త్రీయసంగీత సమ్మేళనం.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓ అమృతభాండం. అది తేనెలొలుకు ఓ తెలుగు పాట, దేశభాషలందు తెలుగు లెస్స.. అనడానికి ఈ ఒక్క పాట వింటే చాలు తెలుగుపై మమకారం, నుడికారం ఇట్టే అర్థమైపోతుంది. ఇందులోని అన్ని పాటలు చిరకాలం గుర్తుండిపోయే ఆణిముత్యాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అప్పటివరకు ఉన్న సినీగేయ, గీత గమనాన్ని మార్చిన ప్రసిద్ధ గేయ రచయిత సీతారామశాస్త్రి. ఈ సినిమాకి గీతాలు రాయడం వలన ఆయనకి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని పేరు వచ్చింది. సినిమాలకి పాటలు రాయడం సిరివెన్నెల సినిమాతోనే మొదలు పెట్టినప్పటికీ ఈ చిత్రంలోని గీతాలలో ఉన్న లాలిత్యం, మాధుర్యం అనన్య సంక్రామకత్వం, అజరామరం. విధాత తలపున.. అనే పాట రాయడానికి గేయ రచయిత సీతారామశాస్త్రికి సుమారుగా వారం రోజుల సమయం తీసుకుంది. భారతీయ సంగీత కళలను ప్రధాన కేంద్రబిందువుగా తీసుకుని సంగీత ప్రియులను అబ్బురపరిచేలా సిరివెన్నెల చిత్రాన్ని వెండితెర దృశ్యకావ్యంగా మలచి భారతీయ చలనచిత్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసిన దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న చిత్రాల పరంపరలో ఆయన మేధోమదనం నుంచి జాలువారిన మరో సంగీత సాహిత్య ప్రాధాన్యమున్న “చిత్రం” సిరివెన్నెల.

1986 పూర్ణోదయ పిక్చర్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్ మున్ సేన్ హీరో, హీరోయిన్లుగా సిరివెన్నెల చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్ర కథ అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి మధ్య చుట్టూ తిరిగే కథ. బెంగాలి నటుడు సర్వదమన్ బెనర్జీని ఆదిశంకరాచార్య, శ్రీ దత్త దర్శనం అనే చిత్రాల్లో చూసిన కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో హీరోగా తీసుకున్నారు. తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయినప్పటికీ నటుడు సాయి కుమార్ ఆయనకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్లోని జైపూర్ లో జరిగింది.

జైపూర్ పర్యాటకశాఖ వారు ముందుగా ఈ సినిమా షూటింగ్ కి కేంద్ర అనుమతి కావాలని కోరగా.. అప్పుడు అజ్మీర్ జిల్లా కలెక్టర్ అంతకుముందే శంకరాభరణం సినిమా చూడడం వలన కె.విశ్వనాథ్ ను గుర్తు పట్టి… ఈ సినిమా షూటింగ్ కి తొందరగా అనుమతి ఇవ్వడం జరిగింది. అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలైన అనంతరం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ నంది బహుమతులతో సినిమా తెలుగు సాహిత్య కీర్తి బావుటాను ఎగురవేసింది. నంది ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, నంది ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, నంది ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఎం.వి.రఘు, నంది ఉత్తమ సహాయనటి మునుమును సేన్ లు పొందారు. ఈ సంవత్సరం నంది అవార్డులతో సిరివెన్నెల సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.

Advertisement

Trending

Exit mobile version