మహారాష్ట్రలో ఓ దొంగ బాబా పేరుతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. తానే శివుడి అవతారమని నమ్మించి ఓ మహిళను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసు ఆలస్యంగా బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్ జిల్లాకు చెందిన రిషికేశ్ వైద్య అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పూణెకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. 2023లో ప్రారంభమైన ఈ పరిచయం కొద్దికాలంలోనే అతను తనను దేవుడి అవతారంగా చూపిస్తూ ఆమెను మానసికంగా ప్రభావితం చేశాడని తెలుస్తోంది. ఆమెను తన ‘పార్వతి’గా పేర్కొంటూ విశ్వాసం పెంచుకున్నాడు.
ఈ విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని, పూణెలోని ఒక లాడ్జికి తీసుకెళ్లి, మత్తు పదార్థం ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగకుండా, ఘటన సమయంలో ఆమెకు తెలియకుండా ఫోటోలు తీసి, వాటిని ఆధారంగా చేసుకుని తరువాత బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఇక ఈ వేధింపులు ఇక్కడితో ఆగలేదు. గత ఏడాది మేలో మరోసారి హోటల్‌కు పిలిపించి మళ్లీ దాడికి ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. దీంతో భయంతో మౌనంగా ఉన్న ఆమె, ఇటీవల మరో దొంగ బాబా అరెస్ట్ వార్త చూసి ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించింది.
మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, కేసును పూణెలోని హడప్‌సర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో మరికొన్ని మహిళలు కూడా మోసపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు మరోసారి మోసగాళ్ల పేరుతో నడిచే నకిలీ బాబాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులపై జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.































