గత నెల అహ్మదాబాద్ వద్ద జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) 15 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ ప్రమాదానికి రెండు ఇంజిన్లు సకాలంలో పనిచేయకపోవడమే కారణమని, ఇందులో కుట్ర కోణం ఏదీ లేదని స్పష్టం చేసింది.

టేకాఫ్ అయిన కొద్దిక్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో ఇంజిన్లు పని చేయడం మానేశాయి. ఈ విషయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్‌పిట్ ఆడియోలో రికార్డు అయ్యింది. “ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావా?” అన్న ఒక పైలట్‌కు “లేదు, నేనేం చేయలేదు” అంటూ మరొక పైలట్ స్పందించాడు. పవర్ కోల్పోయిన వెంటనే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయినట్లు రికార్డుల్లో ఉంది. పైలట్లు ఇంజిన్లను మళ్లీ ఆన్ చేయడానికి యత్నించినా, ఒక ఇంజన్ మాత్రమే రీస్టార్ట్ అవగా, రెండో ఇంజన్ స్పందించకపోవడంతో కేవలం 32 సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది.
AAIB నివేదిక ప్రకారం, విమానంలో ఫ్యూయల్ పరిశుభ్రంగానే ఉండి, కలుషిత పదార్థాల జాడ ఏదీ లభించలేదు. పక్షుల ఢీ కొట్టిన సంఘటనలు లేవు. వాతావరణం సానుకూలంగానే ఉంది. టేకాఫ్‌కు అవసరమైన రెక్కలు, గేర్ల వ్యవస్థ సరిగ్గా పని చేసినట్లు నివేదిక చెబుతోంది. విమానంలో అధిక బరువులు లేవు. పైలట్లు అనుభవజ్ఞులు కాగా, ఆరోగ్యపరమైన సమస్యలు లేదా మానసిక ఒత్తిడులేమీ లేదని స్పష్టమైంది.
కూట్ర కోణాన్ని ఖండించిన ఈ నివేదికపై Air India మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఎలాంటి వ్యాఖ్య చేయలేమని తెలిపింది. AAIB తాజా నివేదిక వాస్తవ పరిణామాలను స్పష్టంగా రుజువు చేసినప్పటికీ, ఈ ఘటనపై ఇంకా లోతైన విచారణ కొనసాగుతుందని పేర్కొంది.



























