Actor Vijaya Rangaraju : ఆంధ్రప్రదేశ్ కి చెందిన విలన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ రంగరాజు పలుభాషల్లో నటించినా తెలుగులో ‘యజ్ఞం’ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు తోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. అయితే ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల పూణే లో పుట్టి అక్కడే పెరిగారు. అయితే రాయలసీమ లోని గుంతకల్లు లో చదువు పూర్తి చేసారు. ఇక నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి ఉండటం వల్ల వాటి మీద ఫోకస్ చేసారు. చెన్నై వెళ్లి దాదాపు 100 నాటకాలు వేసారు. ఇక సినిమాల్లో ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టమంటూ చెప్పే రంగరాజు గారు తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

ఆస్తులు పోయి లండన్ వెళ్ళిపోయా…
రంగరాజు గారు మొదటగా బాపు గారి సీతకళ్యాణం సినిమాలో నటించారు. అయితే అప్పటికే మలయాళం లో వియత్నం కాలనీ అనే సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. అలా కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, తమిళం వంటి పలు భాషల్లో నటించిన ఆయన ఆస్తులు బాగానే సంపాదించుకున్నా ఇతర వ్యాపారాలకు వెళ్లి దెబ్బతిన్నారు. లోన్స్ ఇచ్చి ఈఏంఐ కట్టిన వస్తువులు తీసుకునే వ్యాపారంలో మోసపోయి దాదాపుగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు.

అలా అప్పు తీసుకున్నవాళ్లు గొడవ పడి పోలీస్ కేసు అవడం వల్ల లండన్ వెళ్లిన ఆయన అక్కడ చిన్న చిన్న పనులను చేస్తూ సంపాదించారట. మొదటి నుండి డబ్బు, బంగారం అంటే చాలా ఇష్టం అని ఒంటి మీద చాలా బంగారం ఉండేది అంటూ చెప్పారు రంగరాజు గారు. ఇక లండన్ లో కొంత సంపాదించుకున్న డబ్బును కూడా బంధువులకు అప్పుగా ఇచ్చి పోగొట్టుకున్నారట. ఇక మళ్ళీ ఇండియా వచ్చిన ఆయన యజ్ఞం సినిమాలో విలన్ గా చేసి మళ్ళీ కెరీర్ లో నిలదొక్కుకున్నారు.