Analyst Damu Balaji : తెలంగాణ ఉద్యమగళం మూగబోయింది. ఆశుగా పాటలను పాడి ప్రజలలో చైతన్యం నింపిన గద్దర్ ఇక లేరు. ఎంతో మందిని తన గళంతో ఉత్తేజపరిచి గ్రామాలలో గిరిజనుల మీద జరుగుతున్న అకృత్యాలను చెబుతూ గిరిజన, స్త్రీలకోసం పోరాడిన ఉద్యమకారుడు తెలంగాణ తొలి మరియు మలి ఉద్యమాలలో తన గళంతో చైతన్యం నింపిన గద్దర్ జులై 20వ తేదీన గుండెపోటుతో అపోలో హాస్పిటల్ లో చేరగా బైపాస్ సర్జరీ జరిగింది. అయితే ఆపరేషన్ తరువాత ఊపిరి తిత్తులు, యూరినరీ సమస్యలతో ఆగష్టు 6న మరణించారు. ఆయన జీవిత విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

ప్రజలను చైతన్య పరిచిన గళం మూగబోయింది…
అనలిస్ట్ దాము బాలాజీ గద్దర్ గారి వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. గద్దర్ గారి అసలు పేరు గుమ్మడి విఠల్ రావు, తెలంగాణ తూప్రాన్ గ్రామంలో జన్మించిన ఆయన బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఏర్పడిన గదర్ పార్టీ గుర్తుగా ఆయన పేరును గద్దర్ గా మార్చుకున్నారు. ఆయనకు భార్య విమల గద్దర్, పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల కాగా చంద్రుడు 2006లో అనారోగ్యంతో మరణించారు. సూర్యుడు కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసినా ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు అంటూ బాలాజీ తెలిపారు. గద్దర్ తెలంగాణ జన నాట్య మండలి ద్వారా అనేక చైతన్య కార్యక్రమాలను నిర్వహించారని బాలాజీ తెలిపారు. అలాగే పీపుల్స్ వార్ నక్సల్ గ్రూపులతో లవ్ అండ్ హేట్ రిలేషన్ కొనసాగించారని బాలాజీ తెలిపారు.

నక్సల్స్ మీద నిషేధం విధించినపుడు ఆయన మహారాష్ట్రలో ఉండేవారని, 1990లో చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చాక నక్సల్స్ మీద నిషేధం ఎత్తేశాక ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చారని, అప్పట్లో సభ నిర్వహిస్తే లక్షల్లో జనాలు హాజరయ్యారంటూ బాలాజీ తెలిపారు. ఇక ఆయన మీద పోలీసులు కాల్పులు జరిపి ఆరు బుల్లెట్లు శరీరంలో దిగినా ఆయన మరణించలేదు. ఒక బుల్లెట్ ఆయన శరీరంలో ఉండిపోయింది. ఇక ఆయన సినిమాల్లో కూడా నటించి విప్లవ గీతాలను ఆలపించారు. మా భూమి సినిమాలో బండెనక బండి కట్టి పాటను ఆయనే పాడి అందులో నటించారు. అలాగే జై బోలో తెలంగాణ సినిమాలో కూడా నటించి “పొడుస్తున్న పొద్దులో ” పాటను ఆలపించారు. ఉద్యమ సమయంలో ఈ పాట బాగా హిట్ అయింది. ఇక ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాజకీయ పార్టీ కూడా ప్రారంభించారు. బ్యాంకులో చేస్తున్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి జనం కోసం తన గళం విప్పిన కవి, ప్రజా గాయకుడు గద్దర్ మరణించినా తెలుగు సమాజం ఆయనను మరువదు.