గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలపై నిపుణులు ప్రాథమికంగా కొన్ని అంచనాలు వేస్తున్నారు. పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

విమానంలో ఏం జరిగింది?
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ 171) అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి ప్రయాణికులతో బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టు దగ్గరలో కుప్పకూలిందని సమాచారం. ఈ ఘటనతో విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
నిపుణుల అంచనా ఏమిటి?
ఈ ప్రమాదంపై విమానయాన నిపుణులు స్పందిస్తూ.. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల విమానం టేకాఫ్‌కు అవసరమైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదం జరిగి ఉండొచ్చని ఎన్డీటీవీకి తెలిపారు. అంటే, పక్షి ఢీకొనడం వల్ల విమానం ఇంజిన్‌లో సమస్యలు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
విమానయాన రంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. “ప్రస్తుతానికి ఇది పక్షులు ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనివల్ల రెండు ఇంజన్లు ఒక్కసారిగా శక్తిని కోల్పోయి ఉండవచ్చు. టేకాఫ్ అయితే సజావుగానే జరిగింది. కానీ, గేర్లను పైకి తీసుకునే లోపే విమానం కిందకు దిగడం మొదలుపెట్టింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. దీనికి అసలు కారణం దర్యాప్తులో తెలుస్తుంది” అని వివరించారు.
అంతేకాకుండా, “దృశ్యాలను బట్టి చూస్తే టేకాఫ్ సమయంలో ఎలాంటి సమస్యలు లేవు. విమానం నియంత్రిత పద్ధతిలోనే కిందకు వచ్చింది. పైలట్ ‘మేడే’ కాల్ ఇచ్చారు, అంటే అది అత్యవసర పరిస్థితి అని అర్థం” అని ఆయన నొక్కి చెప్పారు. దీనిని బట్టి చూస్తే పైలట్ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు పూర్తయితేనే అసలు కారణాలు తెలుస్తాయి.































