చిత్ర విజయం అపజయం కాలాతీతం. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో ఎవరు ఊహించగలరు. అలా అక్కినేని నాగార్జున ఒకే సంవత్సరంలో డబుల్ ధమాకా అందుకున్నారు.
గీతాంజలి 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. “యంగ్ డై ఫస్ట్” అనే అంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం అదే తరహాలో ఈ కథ రాసుకున్నాడు.

కథానాయిక పేరు గీతాంజలి ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12అక్టోబర్, 1988 నాడు చిత్రీకరణ మొదలయింది. చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అయింది. ఈ చిత్రం విడుదల నాగార్జున యొక్క మరొక అపూర్వ విజయం సాధించిన శివ చిత్రం విడుదలకు ఆరునెలల ముందు జరిగినది.

గతంలో ఆర్జీవీ కలెక్టర్ గారి అబ్బాయి, రావుగారిల్లు సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు. ఈ సినిమాల సమయంలోనే నాగార్జునతో వర్మకు పరిచయం ఏర్పడింది. ఆ తరవాత “రాత్రి” (సినిమా) అనే కథను అల్లి నాగార్జునకు వినిపించాడు. కానీ నాగ్ అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. ఆ తరవాత తను చదువుకున్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటనలను మరియు బాలీవుడ్ సినిమాల్లోని కాలచక్ర, అర్జున్ హాలీవుడ్ మూవీ ఎంటర్ ది డ్రాగన్ లోని కొన్ని సన్నివేశాలను ఆధారం చేసుకుని ఒక కథను తయారు చేశాడు. ఆ కథ నాగార్జునకు నచ్చడంతో.. తమ సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి అయన ముందుకొచ్చారు. ఆ విధంగా 1989 అక్టోబర్ 5న “శివ” చిత్రం విడుదలయ్యింది.

ఆర్జీవీ ఈ రెండు చిత్రాల కథలలో వ్యత్యాసం, చిత్రీకరించిన విధానము తెలుగు సినిమాకు నూతనముగా ఉండటము చేత గొప్ప విజయాలుగా నిలిచాయి. అప్పటి కమర్షియల్ చిత్రాలకు గీతాంజలి, శివ చిత్రాలు భిన్నంగా ఉండడం.. గీతాంజలి సినిమాలో స్లో సీన్స్, శివ చిత్రంలో కామెడీ మైనస్ ఉండడంతో.. సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు మొదటగా పెదవి విరిచారు. ఆ తర్వాత ఈ సినిమాలను ఎగబడి చూశారు. ఈ రెండు చిత్రాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించడం ఒక విశేషం. ఆ రోజుల్లో ఈ రెండు చిత్రాల్లోని పాటలు ఆకాశవాణిలో మారుమోగాయి. రేడియో ఆన్ చేస్తే ఈ సినిమాల పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదు. ఈ చిత్రాల విడుదల తరువాత ఎందరో అమ్మాయిల మనస్సు దోచుకున్న మన్మధునిగా నాగార్జున నిలిచిపోయారు. ఈ చిత్రాల నుండి నాగార్జునకు కొత్తదనాన్ని అభిలషించే వ్యక్తిగా ప్రశంసలు పొందారు.































