Categories: FeaturedMovie News

వెండితెరపై దర్శకేంద్రుని మాయాజాలం !!

ఒక దృశ్యకావ్యం… ఒక కళాఖండం. – ఇలాంటి మాటలు ఎంతో అనుభూతికి గురయితే తప్ప వినిపించవు. కానీ కె.రాఘవేంద్రరావు సినిమా సినిమాలు చూసిన ప్రతిసారీ ఏదో ఒక సందర్భంలో ఈ మాట గుర్తుకొస్తుందంటే అది అతిశయోక్తి కాదు. ఒక ఫ్రేమ్‌ని ఒక పెయింటింగ్‌లా ఎలా తీర్చిదిద్దాలో ఆయనకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. కమర్షియల్‌ సినిమా అనే మాటకి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో మంది దర్శకుల్ని చూసుంటుంది. కానీ కె.రాఘవేంద్రరావు ప్రత్యేకం. ఆయన ఫ్రేమ్‌ అంటే వెండితెర సైతం మురిసిపోతుంటుంది. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు తీసిన కె.రాఘవేంద్రరావు శతాధిక చిత్ర దర్శకుల్లో ఒకరు. నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలు చేశారు. ‘బాహుబలి’ చిత్రాల నిర్మాణాంలో భాగస్వామ్యమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన ఆ చిత్రాలకి సమర్పకులుగా వ్యవహరించారు కె.రాఘవేంద్రరావు. వెండితెరపై ఇంద్రజాలం ప్రదర్శించిన దర్శకుడు కావడంతో ఆయన దర్శకేంద్రుడుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు. సీనియర్‌ దర్శకులు కోవెలమూడి సూర్యప్రకాష్, కోటేశ్వరమ్మ దంపతులకి మే 23, 1942న.. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు కె.రాఘవేంద్రరావు. బి.ఎ చదువుకున్న ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మొదట్లో సహాయ దర్శకుడిగా పనిచేశారు. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ‘బాబు’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జ్యోతి’ చేసి పేరు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేసినా.. ఆ తర్వాత హీరోయిజంపై దృష్టిపెట్టారు. ప్రతి అగ్ర కథానాయకుడు ఒక్కసారైనా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడేంతగా ఆయన తెరపై హీరోయిజాన్ని చూపించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్‌ వంటి సీనియర్లు మొదలుకొని… నవతరంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, నితిన్, మనోజ్‌ల వరకు పలువురు కథానాయకులతో సినిమాలు తీసి విజయాలు అందుకొన్నారు కె.రాఘవేంద్రరావు. అడవిరాముడు, సింహబలుడు, కేడీనెంబర్‌ 1, డ్రైవర్‌ రాముడు, వేటగాడు, భలే కృష్ణుడు, ఘరానా దొంగ, రౌడీరాముడు కొంటె కృష్ణుడు, దేవత, జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం, బొబ్బిలి బ్రహ్మన్న, అపూర్వ సహోదరులు, కొండవీటి రాజా, భారతంలో అర్జునుడు, అగ్నిపుత్రుడు, దొంగరాముడు, ఆఖరి పోరాటం, కూలీ నెం 1, రౌడీఅల్లుడు, సుందరకాండ, అల్లరి మొగుడు, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, ముగ్గురు మొనగాళ్లు, ముద్దుల ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య, ఇద్దరుమిత్రులు, శ్రీమంజునాథ, శ్రీరామదాసు… ఇలా చెప్పుకోదగ్గ సినిమాలు ఆయన కెరీర్‌లో ఎన్నో. తరాలు మారినా సరే… ఆయన ప్రేక్షకుల అభిరుచులకి తగ్గ సినిమాలు తీయడంలో దిట్ట.

రొమాంటిక్‌ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్‌ థ్రిల్లర్, జీవిత కథలు… ఇలా ఆయన వెండితెరపై టచ్‌ చేయని అంశం లేదేమో. సినిమా అంతా ఒకెత్తైతే… పాటలు మరో ఎత్తు అనేలా ఆయన దర్శకత్వం సాగుతుంటుంది. పండ్లు, పూల నేపథ్యంలో పాటల్ని తెరకెక్కిస్తూ వెండితెరని ఒక పెయింటింగ్‌లా మార్చేస్తుంటారు. కథానాయికలు రెట్టింపు అందంతో కనిపిస్తుంటారు. ప్రతి కథానాయిక రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక్కసారైనా సినిమా చేయాలని ఆశపడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల వరుసగా తీసిన ‘శిరిడీసాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలతో ఆయన భక్తి ప్రధానమైన కథలపైనే దృష్టిపెట్టినట్టు అర్ధమవుతోంది. కె.రాఘవేంద్రరావు బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ‘శాంతినివాసం’ అనే ధారావాహికకి రచయితగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కోయిలమ్మ, సై సై సయ్యారే, అగ్నిసాక్షి చిత్రాల వెనక కూడా రాఘవేంద్రరావు ఉన్నారు. యాభయ్యేళ్లుగా సాగుతున్న తన సినీ ప్రయాణం… అందులో అనుభవాల్ని రంగరించి, నేటి తరానికి ఒక పాఠంగా ‘సౌందర్య లహరి’ని తీసుకొచ్చారు. తనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఇందులో కె.రాఘవేంద్రరావు పంచుకొన్న అనుభవాలు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. 2014లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతోపాటు… బి.ఎన్‌.రెడ్డి జాతీయ పురస్కారం పురస్కారాల్ని అందుకొన్నారు కె.రాఘవేంద్రరావు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘అల్లరి ప్రియుడు’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’ చిత్రాలకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాలు స్వీకరించారు. పెళ్లిసందడి’ చిత్రంలో ఒక పాట నృత్య దర్శకత్వానికిగానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా కూడా నంది అందుకొన్నారు. రాఘవేంద్రరావుకి భార్య సరళతోపాటు, తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి, కూతురు మాధవి ఉన్నారు. ప్రకాష్‌ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దర్శకుడిగా సినిమాలు తీస్తున్నారు.

ఈ రోజు కె.రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు.. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు????????????

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago