భోజనం సమయంలో ఉప్పు తక్కువగా ఉందని అనిపిస్తే పైగా కొద్దిగా చల్లి తినడం చాలా మందికి సాధారణ అలవాటే. కానీ ఈ చిన్న అలవాటు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు. వైద్య నిపుణుల ప్రకారం, వండినప్పుడు కలిపే ఉప్పుతో పోలిస్తే, పచ్చిగా చల్లుకునే ఉప్పు శరీరంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది నేరుగా రక్తంలో సోడియం స్థాయిని పెంచి, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుందని చెబుతున్నారు.

ఇలాంటి అలవాటు వల్ల ముఖ్యంగా రక్తపోటు సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అధిక సోడియం కారణంగా గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీపీ లేదా హార్ట్ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కేవలం రక్తపోటే కాకుండా, కిడ్నీలపై కూడా అదనపు భారాన్ని మోపుతుంది. శరీరంలో సోడియం అధికమైతే దాన్ని బయటకు పంపేందుకు కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ పనితీరును దెబ్బతీయొచ్చు. అదే సమయంలో శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల వాపు, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు.
ఎముకల ఆరోగ్యంపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల క్యాల్షియం శరీరం నుంచి బయటకు పోయే అవకాశం పెరిగి, ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రలేమి, తలనొప్పి, అధిక దాహం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
World Health Organization సూచనల ప్రకారం రోజుకు ఒక టీస్పూన్‌కు మించకుండా ఉప్పు తీసుకోవడం మంచిది. రుచి కోసం నిమ్మరసం, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్, పచ్చళ్లు, చిప్స్ వంటి వాటిలో సోడియం అధికంగా ఉండటంతో వాటిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.



























