భార్యాభర్తల మధ్య నమ్మకానికి వివాహేతర సంబంధాలు ఎలా చరమగీతం పాడుతున్నాయో మరోసారి రుజువైంది. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్న భర్తలే లక్ష్యంగా మారుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

పెద్దారవీడు మండలం దోర్నాల ప్రాంతానికి చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను కాలక్రమంలో చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం గంజాయి విక్రయ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా, ఒంగోలు జైలులో రిమాండ్‌కు వెళ్లాడు.
ఈలోపు ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడైన జమ్మిదోర్నాలకు చెందిన కారు డ్రైవర్ సూర్యనారాయణతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన శ్రీను, జైలులో తనను కలిసేందుకు వచ్చిన భార్య, తమ్ముడిని బెదిరించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిని చంపేస్తానని హెచ్చరించాడు.
ఈ బెదిరింపులతో భయపడిన ఝాన్సీ, ఆమె తమ్ముడు ముందే భర్తను హతమార్చాలని కుట్ర పన్నారు. ఇందుకోసం గుంటూరుకు చెందిన మరో నలుగురిని సంప్రదించి రూ. రెండు లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు.
శ్రీను బెయిల్‌పై విడుదలై ఒంగోలు నుంచి వస్తున్న సమయంలో మొదట చీమకుర్తి, పొదిలి ప్రాంతాల్లో హత్యకు ప్రయత్నించినా అది విఫలమైంది. చివరకు పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో కారు ఆపి మూత్ర విసర్జనకు దిగిన సమయంలో దాడి చేశారు. వెనుక నుంచి బైక్‌పై వచ్చిన సూర్యనారాయణ, అతని స్నేహితులు శ్రీను కళ్లలో కారం కొట్టగా, కారులో ముందే సిద్ధంగా ఉన్న భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో లాలు శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం ఇతర నిందితులు ‘మీరు పోలీసులకు లొంగిపోతే మిమ్మల్ని బెయిల్‌పై బయటకు తీస్తాం’ అని చెప్పడంతో ఝాన్సీ, ఆమె తమ్ముడు పోలీసులకు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.



























